మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం..
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:50 PM
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మధ్య పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పులి ఉందన్న సమాచారం స్థానిక గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
నిజామాబాద్: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మధ్య పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పులి ఉందన్న సమాచారం స్థానిక గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా దోమకొండ, బిక్కనూర్, మాచారెడ్డిలో పులి సంచరిస్తోంది. గేదెలు, ఆవులను మేపేందుకు పశువుల కాపరులు వెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో పశువులపై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేస్తోంది. ఆహారం కోసం వాటిని చంపేస్తోంది. భయంతో పరుగులు తీసిన పశువుల కాపరులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అధికారులు మాచారెడ్డి అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. పులి కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిరంతర నిఘా పెట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరాలకు చిక్కితే అనంతరం బోను ద్వారా దాన్ని బంధిస్తామని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు. వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పులిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని సమీప గ్రామల ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్: ఎంపీ లక్ష్మణ్
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత