Share News

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:50 PM

ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సెప్టెంబరు 12 నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Restrictions

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 12 నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు అవసరాన్ని బట్టి వాహనాల దారి మళ్లింపులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.


వాహనాల దారి మళ్లింపు

వీవీ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్‌ వైపునకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. పాత పీఎస్‌ సైఫాబాద్‌ నుంచి బడా గణేశ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదన్నారు. రాజ్‌దూత్‌ లేన్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌ వైపు వాహనాలను మళ్లించనున్నట్లు చెప్పారు. ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఐమ్యాక్స్‌ వైపు ట్రాఫిక్‌కు ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మింట్‌ కాంపౌండ్‌ వద్ద సెక్రటేరియట్‌ ఎక్స్‌ రోడ్డు వైపు వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వైపు ట్రాఫిక్‌కు ఆంక్షలు ఉండనున్నట్లు తెలిపారు. నెక్లెస్‌ రోటరీ వద్ద సెక్రటేరియట్‌ జంక్షన్‌ లేదా ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు వాహనాలను మళ్లించనున్నట్లు వివరించారు. అలాగే, నిరంకారి నుంచి ఖైరతాబాద్‌ రైల్వే గేట్‌ వైపు వాహనాలకు అనుమతి లేదన్నారు. ఖైరతాబాద్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద పాత పీఎస్‌ సైఫాబాద్‌ మీదుగా దారి మళ్లించనున్నట్లు చెప్పారు.


రద్దీకి అవకాశం ఉండే ప్రాంతాలివే

ఖైరతాబాద్‌, షాదాన్‌ కాలేజ్‌, అయోధ్య ప్రాంతాల్లో భారీగా వాహనాల రద్దీకి అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నిరంకారి, సైఫాబాద్‌, మింట్‌ కాంపౌండ్‌లో ట్రాఫిక్‌ జామ్‌కు అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, సెక్రటేరియట్‌ జంక్షన్‌లోనూ రద్దీ ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. నెక్లెస్‌ రోటరీ, కేసీపీ జంక్షన్‌, మాసాబ్‌ ట్యాంక్‌ వైపు ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు.


భక్తులకు ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయాలు

మరోవైపు, భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో వాహనదారులకు పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ గార్డెన్‌ వైపు భక్తులకు రేస్‌ కోర్స్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐమ్యాక్స్‌ పక్కన హెచ్‌ఎండీఏ పార్కింగ్‌లో వాహనాలకు అవకాశం ఉందన్నారు. ఐమ్యాక్స్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోనూ పార్కింగ్‌ చేసుకోవచ్చన్నారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌ వైపు వచ్చే భక్తులకు విశ్వేశ్వరయ్య భవన్‌లో పార్కింగ్‌ సదుపాయం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని వాహనదారులు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ 9010203626ను సంప్రదించాలని పోలీసులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీలో బీసీ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం.. బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్‌..

సెప్టెంబర్‌ 17 నుంచి సేవా సంకల్ప్‌ అభియాన్‌ ప్రారంభం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

Updated Date - Sep 11 , 2026 | 08:23 PM