అసెంబ్లీలో బీసీ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం.. బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్..
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:01 PM
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కమలం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై శాసనసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం బాధాకరమని అన్నారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తన నిజమైన వైఖరిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీని బీసీ ద్రోహుల పార్టీ, మనువాదుల పార్టీ అంటూ మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరిగేలా ముందుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ వైఖరిని తెలంగాణలోని బీసీ ప్రజలు గమనించాలని, బీసీ సంఘాలు ఆ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కులగణన ద్వారా దేశంలో నెలకొన్న కుల అసమానతలను తగ్గించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణన విషయంలో కేంద్రం ఒకటి చెబుతూ.. మరోటి చేస్తోందని ఆరోపించారు. ఇకనైనా బీసీల డిమాండ్‌ను కేంద్రం గుర్తించి కులగణన చేపట్టాలని కోరారు.
బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై బీజేపీ వాకౌట్ చేయడం దారుణమని మంత్రి సీతక్క అన్నారు. ప్రధాని మోదీ పేరుకే బీసీ అని, కానీ జనగణనలో కులగణన చేపట్టేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. బీసీలు కేవలం వెనుకబడిన వర్గాలు కాదని.. దేశానికి వెన్నెముకలాంటి ఉత్పత్తి కులాలని పేర్కొన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీల పాత్ర దేశ జీడీపీలో కీలకమన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కులవృత్తులపై ఆధారపడిన వారి ఆర్థిక పరిస్థితి మరింత సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. బీసీ తీర్మానంపై చర్చను పక్కదారి పట్టించి పాయల్ శంకర్ మాట్లాడటం సరికాదన్నారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్‌గానూ బీసీ నేత లేకపోవడాన్ని మంత్రి సీతక్క ప్రశ్నించారు. దేశంలో బీసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని చెప్పుకొచ్చారు. దేశ తొలి ఓబీసీ ప్రధాని దేవేగౌడకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని సీతక్క కోరారు. కాగా, జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని శాసనసభలో మంత్రి పొన్నం తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
సెప్టెంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
అసెంబ్లీలో న్యాయం జరగట్లేదు.. అందుకే ఢిల్లీలో ఫిర్యాదు చేశాం: ఎమ్మెల్యే సబిత