అలైన్‌మెంట్ తకరారు!
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:32 AM
తెలంగాణ మీదుగా ముంబై, బెంగళూరు, చెన్నైకు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్లకు సంబంధించి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య అనేక సమావేశాలు జరిగాయి.
హైదరాబాద్ నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు ఖరారు కాలేదన్న కేంద్ర మంత్రి వైష్ణవ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలోనే వ్యాఖ్యలు
రాష్ట్ర క్యాబినెట్‌లో 3 అలైన్‌మెంట్లకు ఆమోదం
అంతర్గతంగా ఖరారు చేసుకున్న రైల్వే శాఖ
ప్రతిపాదిత మార్గాల్లో మార్కింగులు కూడా
ఇప్పుడు అదేమీ లేదనడం ఏమిటనే చర్చ
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మీదుగా ముంబై, బెంగళూరు, చెన్నైకు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్లకు సంబంధించి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య అనేక సమావేశాలు జరిగాయి. కేంద్ర అధికారులు సీఎం రేవంత్‌తోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాతే బహదూర్‌గూడలో రైల్ హబ్‌కు 400 ఎకరాలు కేటాయించారు. అలైన్‌మెంట్లను క్యాబినెట్‌లోనూ చర్చించి, సూత్రప్రాయంగా ఆమోదించారు. రైల్వే అధికారులు ఇప్పటికే అంతర్గతంగా ఒక అలైన్‌మెంట్‌ను ఖరారు చేసుకున్నారు.
ప్రతిపాదిత మార్గాల్లో హైస్పీడ్ రైల్వే కారిడార్ల కోసమంటూ ఎరుపు, తెలుపు రంగుల్లో మార్కింగ్‌లు కూడా వేశారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త మెలిక పెట్టారు. అసలు కారిడార్ల అలైన్‌మెంట్లే ఖరారు కాలేదని, భూసేకరణ చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయి మార్గాలను ఖరారు చేశాకే రాష్ట్ర ప్రభుత్వాలకు భూ సేకరణ, అలైన్‌మెంట్ల వివరాలను తెలియజేస్తామని వ్యాఖ్యానించారు. అది కూడా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చెప్పడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
గతంలోనే క్యాబినెట్ ఆమోదం
హైస్పీడ్ రైళ్ల కారిడార్లు, అలైన్‌మెంట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంతో కొద్ది కాలంగా రైల్వే అత్యున్నతాధికారులు చర్చలు జరుపుతూ వచ్చారు. ఈ మూడు కారిడార్ల అలైన్‌మెంట్లు, ప్రతిపాదిత స్టేషన్లకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. దాని ప్రకారమే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లోని బహదూర్‌గూడ వద్ద హైస్పీడ్ రైల్వే హబ్ ఏర్పడుతుందన్న విషయంతోపాటు మూడు మార్గాలు ఎటు నుంచి ఎలా వెళ్తాయన్నది తెలిసింది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్- ముంబై-పుణె కారిడార్ 93 కిలోమీటర్లు; హైదరాబాద్-బెంగళూరు 205 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదించిన మార్గం 180 కిలోమీటర్లు ఉందని పేర్కొన్నారు.
అంతేనా.. ప్రతిపాదిత మార్గాల్లో అలైన్‌మెంట్‌కు సంబంధించిన శాటిలైట్ మ్యాపులు, ప్రతిపాదిత స్టేషన్ల నమూనాలు, ఏ ప్రాంతంలో స్టేషన్ వస్తుందన్న విషయాలను కూడా పొందుపర్చారు. ఆ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పలు సవరణలు చేపట్టింది. ఆ మేరకు అలైన్‌మెంట్లు, స్టేషన్లు, డిపోల సవరించిన ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది. అలాగే, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గానికి పక్క నుంచే వెళ్లేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొన్ని స్టేషన్ల పేర్లను కూడా మార్చింది. అదే విషయాన్ని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు తెలియజేసింది. ప్రాథమిక నివేదికలో హాలియా దగ్గర ఒక స్టేషన్ వస్తుందని పేర్కొన్నారు.
ఇక, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- ముంబై కారిడార్ల ప్రాథమిక అంచనాల్లో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కీలక అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య నేతలు పచ్చజెండా ఊపారు కూడా. భూ సేకరణ పూర్తి చేస్తే వెంటనే నిర్మాణాలు ప్రారంభించడమే అన్నంత స్థాయిలో హడావుడి చేశారు. భూముల గుర్తింపునకు అధికారులు రంగంలోకి దిగారు కూడా. ఈ క్రమంలోనే భూ సేకరణ వ్యవహారం కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. భూముల గుర్తింపు సమయంలో పెట్టిన ఎరుపు, తెలుపు రంగుల మార్కింగ్‌లు ఆయా ప్రాంతాల ప్రజల్లో దడ పుట్టించాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అలైన్‌మెంటే ఖరారు కాలేదని, భూ సేకరణ చేపడితే చట్ట విరుద్ధమంటూ వ్యాఖ్యానించడం వెనక లోగుట్టు ఏమిటనే చర్చ జరుగుతోంది.
ఆ మార్కింగులు ఎలా వచ్చాయి?
ప్రతిపాదిత మార్గాలంటూ హాలియా వంటి ప్రాంతాల్లో ఎరుపు, తెలుపు రంగులతో కూడిన మార్కింగ్‌లు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. హాలియా మున్సిపాలిటీ దగ్గర్లోని పెద్దగూడెం స్టేజీ సమీపంలో ఇటీవల ఈ మార్కింగ్‌ల వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది. స్థానికంగా తెలుసుకోవాలని అక్కడి వారు ప్రయత్నించినా ఆ మార్కింగ్‌ల వ్యవహారం తెలియలేదని ఓ రైతు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పంటలు వేయొద్దు
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్
హైస్పీడ్ రైళ్ల అలైన్‌మెంట్ ఖరారు కాలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News