Share News

అర్ధరాత్రి భారీవర్షం

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:52 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

అర్ధరాత్రి భారీవర్షం

  • కూకట్‌పల్లి, వివేకానగర్‌లో 7.8 సెం.మీ,

  • బొమ్మలరామారంలో 8.5 సెం.మీ వర్షపాతం నమోదు

  • ధాన్యం తడిసి పలుచోట్ల రైతులకు తీవ్రనష్టం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి దాటాక గాలి, ఉరుములు, మెరుపులు లేకుండానే ఒక్కసారిగా వర్షం మొదలై శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 7.8, సఫీల్‌గూడలో 7.5, షేక్‌పేట్‌లో 6.7, బోరబండలో 6.2, మాదాపూర్‌లో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.


ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే పంట దిగుబడులు లేక సతమతమవుతున్న రైతులకు ఈ అకాల వర్షం మరిన్ని కష్టాల పాలుచేసింది. పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసిముద్దయింది. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌ సీ బ్లాక్‌లో రెండు ద్విచక్రవాహనాలు నాలాలో కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రంలో నవంబరు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో గత పదేళ్లలో నవంబరులో ఈస్థాయిలో వర్షం పడలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నవంబరు నెలలో సగటు వర్షపాతం 1.5 సెం.మీ. కురవాల్సివుండగా, ఇప్పటికే 2 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. అంటే 25 శాతం అధిక వర్షపాతం నమోదైంది అన్నమాట. ఈ ఏడాది మొత్తం వర్షకాల సీజన్‌లో ఈ ఒక్క నెలలోనే సగటు కంటే అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 03:56 AM