నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
ABN , Publish Date - Nov 27 , 2026 | 08:28 PM
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ (శుక్రవారం) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ (శుక్రవారం) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయని అధికారులపై ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రూపాయీ అర్హులైన లబ్ధిదారులకు చేరాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు అడ్లూరి లక్ష్మణ్ పలు సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్, సోలార్ ఫెన్సింగ్ సదుపాయాలు కల్పించాలని, డ్రోన్ పైలట్ శిక్షణతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని ఆయన చెప్పారు.
బలహీన వర్గాల యువత కోసం ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. రైతుల సూపర్ మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై ఆయన ప్రతిపాదనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వాలని, వారి పెండింగ్ బిల్లులపై దృష్టి సారించాలని ఆదేశించారు. రూ.242 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. గురుకులాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39 కేంద్రీకృత వంటశాలల నిర్మాణాన్ని డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు అడ్లూరి లక్ష్మణ్ ప్రతిపాదనలు చేశారు. గ్రూప్స్, సివిల్స్, బ్యాంకింగ్ సహా పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఆ సర్కిళ్లను తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ మేరకు వారం రోజుల్లోగా శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సమర్పించాలని, ప్రతి వారం నిధుల వినియోగం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మార్చి 2027 నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలని తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
ఏడాదిలో గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
దేశానికి రోల్ మోడల్ కానున్న తెలంగాణ భూ సర్వే: మంత్రి పొంగులేటి