Share News

నవంబరు 30తో ముగియనున్న ఐటీఆర్ గడువు.. వీరికి ఇదే చివరి అవకాశం..

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:38 PM

అంతర్జాతీయ లావాదేవీలు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చే నిర్దిష్ట వర్గాల వారు ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్)ను నవంబరు 30వ తేదీ లోపు దాఖలు చేయాలి.

నవంబరు 30తో ముగియనున్న ఐటీఆర్ గడువు.. వీరికి ఇదే చివరి అవకాశం..
ITR Filing Deadline 2026

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ లావాదేవీలు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చే నిర్దిష్ట వర్గాల వారు ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్)ను నవంబరు 30వ తేదీ లోపు దాఖలు చేయాలి. ఈ గడువులోగా రిటర్నులు దాఖలు చేయకపోతే ఆలస్య రుసుములు, వడ్డీతో పాటు ఇతర పన్ను సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి (2026-27 అసెస్‌మెంట్ ఇయర్) సంబంధించి నవంబరు 30లోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన వారు ఎవరు? గడువు దాటితే ఏమవుతుంది? తెలుసుకుందాం (ITR Filing Deadline 2026).


ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 92ఈ ప్రకారం ఫామ్ 3సీఈబీ సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు నవంబరు 30 చివరి తేదీగా ఉంది. విదేశాల్లోని సంబంధిత కంపెనీలు లేదా అనుబంధ సంస్థలతో ఆర్థిక లావాదేవీలు జరిపి, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనల పరిధిలోకి వచ్చే సంస్థలు ఈ గడువు లోగా ఐటీఆర్ దాఖలు చేయాలి. అలాగే ఆదాయపు పన్ను చట్టం నిర్దేశించిన పరిమితులు, షరతులకు లోబడి దేశీయంగా ప్రత్యేక లావాదేవీలు నిర్వహించే సంస్థలు కూడా ఈ గడువు లోగా దాఖలు చేయాలి. సెక్షన్ 92ఈ కింద చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి నివేదిక పొందాల్సిన వ్యక్తులు, సంస్థలు, సెక్షన్ 92ఈ నిబంధనలు వర్తించే భాగస్వామ్య సంస్థల్లోని భాగస్వాములు కూడా నవంబరు 30వ తేదీ లోపు తమ ఐటీఆర్ దాఖలు చేయాలి (November 30 ITR Deadline).


నవంబరు 30లోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన వారు ఆ తేదీని మిస్ అయితే అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది (Income Tax Return). తుది గడువు లోగా దాఖలు చేయని వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం రూ.5,000 వరకు జరిమానా కట్టాల్సి రావచ్చు. అలాగే చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సాధారణ నిబంధనల ప్రకారం 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆలస్య రిటర్న్‌ను డిసెంబర్ 31, 2026లోగా దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఆలస్య రుసుము, వర్తించే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..


మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..

Updated Date - Nov 27 , 2026 | 07:39 PM