Share News

అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:50 PM

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం దీపం వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాలన్న న్యాయస్థానం ఆదేశాలు అమలు కాకపోవడంపై మదురై జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది.

అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Thiruparankundram Deepam Row

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం దీపం వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాలన్న న్యాయస్థానం ఆదేశాలు అమలు కాకపోవడంపై మదురై జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌దేనని స్పష్టం చేసింది. శుక్రవారం దీపం వివాదానికి సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది (Thiruparankundram Deepam Row).


మదురై జిల్లా కలెక్టర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ.. 'ఆదేశాలను అమలు చేయాల్సింది మీరే కదా? కలెక్టర్‌గా మీకు ఆ బాధ్యత ఉంది కదా? మీరు ఆ పని పూర్తి చేయాలి కదా.. అసలు ఏం జరిగింది?' అంటూ ప్రశ్నించింది. జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే, కోర్టు ఆదేశాలను నీరుగార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు (Deepathoon Controversy).


ఈ వివాదంలో తిరుప్పరంకుండ్రం ఆలయ ధర్మకర్తల మండలిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి (Tamil Nadu News). కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పిటిషనర్లు, భారత పురావస్తు శాఖ తరఫున వాదించిన న్యాయవాదులు పేర్కొన్నారు. మండలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్మకర్తలను తొలగించాలని కూడా పిటిషనర్లు డిమాండ్ చేశారు. భారత పురావస్తు శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ.. నిర్ణీత స్తంభం వద్ద దీపం వెలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రక్రియను స్వతంత్ర సంస్థ పర్యవేక్షించాలని, అవసరమైతే కేంద్ర బలగాలను కూడా మోహరించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 27 , 2026 | 02:54 PM