వెండి కాదు.. అల్యూమినియం పూత!
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:16 AM
కోవా, కాజూ కట్లీ, కాజూ రోల్, చమ్ చమ్ వంటి స్వీట్లు, కిళ్లీల్లో సిల్వర్ బదులు అల్యూమినియం వరఖ్ (పూత)ను వినియోగిస్తూ ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠా ఆటకట్టించారు సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
స్వీట్లు, కిళ్లీల్లో యథేచ్ఛగా వినియోగం
అజీర్తి, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు
అల్యూమినియంను ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చి తెలంగాణవ్యాప్తంగా సరఫరా
హైదరాబాద్‌కు చెందిన 4 దుకాణాల యజమానుల అరెస్టు.. వరఖ్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కోవా, కాజూ కట్లీ, కాజూ రోల్, చమ్ చమ్ వంటి స్వీట్లు, కిళ్లీల్లో సిల్వర్ బదులు అల్యూమినియం వరఖ్ (పూత)ను వినియోగిస్తూ ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ముఠా ఆటకట్టించారు సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. నాలుగు దుకాణాలపై మెరుపుదాడులు నిర్వహించి, భారీగా అల్యూమినియం వరఖ్‌లు, పాన్లలో వాడే నకిలీ పేస్టు (చట్నీ), ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఈ వివరాలను మీడియా సమావేశంలో తెలిపారు.
నిందితులు వెండికి బదులుగా చౌకబారు అల్యూమినియం పూతను తమ దుకాణాల్లో వాడడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం వరఖ్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిజానికి 50 గ్రాముల వెండి బహిరంగ మార్కెట్లో రూ.9 వేలు పలుకుతుండగా దాని స్థానంలో రూ.100కు దొరికే అల్యూమినియం వినియోగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అల్యూమినియం పూత పూసిన చక్కెర గుళికలను బేకరీలకు విక్రయిస్తున్నారు. అల్యూమినియం ఫ్లేక్స్‌ను జర్దా, ఖిమామ్, సుగంధ పాన్లలో ఉపయోగిస్తున్నారు.
అల్యూమినియం వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, అజీర్తి వంటి రోగాల బారినపడుతున్నారని సీపీ తెలిపారు. మరిన్ని దుకాణాలపై దాడులు చేస్తామని, కల్తీ కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. యూపీ నుంచి తెలంగాణలో ఎక్కడెక్కడికి అల్యూమినియం ఫ్లేక్స్ సరఫరా అవుతున్నాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. చార్మినార్, ఫలక్‌నుమా ప్రాంతాలకు చెందిన వివిధ షాపుల యజమానులు మహమ్మద్ అక్బర్ (ఇత్తెహాద్ వరఖ్ షాపు), మహమ్మద్ వలీ ఉద్దీన్ (యూటీసీ సిల్వర్ లీఫ్స్), మహమ్మద్ షరీఫ్ (ఎంఏ మెట్రో వరఖ్ షాపు), మహమ్మద్ జలీల్ ఖాన్ (తారా యూనిట్)లను పోలీసులు అరెస్టు చేశారు.
ఎలా గుర్తించాలి..
‘పూత (వరఖ్)ను వేళ్లతో తీసుకొని రుద్దితే పూర్తిగా చితికి రాలిపోతే అది అల్యూమినియం. వేళ్లకు అతుక్కొని ఉండిపోతే అది నిజమైన వెండిపూతగా నిర్ధారించుకోవాల’ని సీపీ స్పష్టం చేశారు. ల్యాబ్ పద్ధతి ఏంటంటే.. ‘సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం (హెచ్‌సీఎల్)ను అల్యూమినియం వరఖ్‌పై చల్లితే అది క్రమంగా కరిగిపోతుంది. కానీ వెండి యథాతథంగా ఉంటుంద’ని మీడియా సమావేశంలో ఆ పరీక్ష చేసి చూపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News