Share News

హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదు

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:44 AM

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేదని, ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాల్లో వాస్తవం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదు
Uttam Kumar Reddy

  • వచ్చే వానాకాలం వరకు రిజర్వాయర్లలో సరిపడా నిల్వలు

  • బీఆర్‌ఎస్‌ విమర్శలు అర్థరహితం.. సిగ్గులేని మాటలు

  • ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేదని, ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాల్లో వాస్తవం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే వానాకాలం వరకు ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. రాబోయే వేసవిలోనూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలేశామంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.


మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది బీఆర్‌ఎస్‌ హయాంలోనేనని మంత్రి గుర్తు చేశారు. రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు 30ు పూర్తయి, రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత.. కేవలం కమీషన్ల కక్కుర్తితోనే ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించారని ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించడం వల్లే మేడిగడ్డ కుంగిపోయి నేడు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయని, ప్రస్తుతం మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులే తేల్చిచెప్పారని వివరించారు. ఇంతటి తప్పిదం చేసి ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి బీఆర్‌ఎస్‌ నేతలకు సిగ్గు, బుద్ధి ఉండాలని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 03:45 AM