Share News

పాతబస్తీలోని బెంగాలీలతో కేంద్ర మంత్రి ఆత్మీయ సమావేశం

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:48 PM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం పాత బస్తీలో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

పాతబస్తీలోని బెంగాలీలతో కేంద్ర మంత్రి ఆత్మీయ సమావేశం
Central minister Bandi Sanjay

హైదరాబాద్, ఏప్రిల్ 06: ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం పాత బస్తీలో నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో దాదాపు 60 వేల మంది బెంగాలీలు నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న వాళ్ల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి.. బీజేపీకి ఓటేయించాలని కోరుతున్నాను. బీజేపీకి ఓటేయిస్తామని హైదరాబాద్‌లోని బెంగాలీ సమాజమంతా హామీ ఇచ్చారు. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది.


బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రెడ్ కార్పేట్ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా చేస్తున్నారు. బెంగాల్‌లో ఉండలేక చాలా మంది బెంగాలీలు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. పాతబస్తీలోనూ బెంగాలీ కుటుంబాలు ఉండలేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. 2014 కంటే ముందే యూపీఏ పాలనలో బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి అక్రమంగా వేల మంది హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి రెడ్ కార్పెట్ పర్చారు. చొరబాటుదారులతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేసేందుకు కేంద్రం ముందుకొస్తే.. మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తోంది.


చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య బెంగాల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి ఓటేసి దేశ భద్రతలో భాగస్వాములు కావాలని బెంగాల్ ప్రజలను కోరుతున్నాను. పాతబస్తీలో కొంత మంది బెంగాలీ కుటుంబాల పిల్లలను మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎర వేసి లోబర్చుకునే ప్రయత్నం చేశారు. మజ్లిస్ గూండాల అరాచకాలకు పోలీసులూ వత్తాసు పలకడం సిగ్గు చేటు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులపై మజ్లిస్ ఎమ్మెల్సీ, నాయకులు అడ్డుకుని దౌర్జన్యం చేసినా చర్యలు తీసుకునే పాపాన పోలేదు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి ఇది నిదర్శనం. మజ్లిస్‌కు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా దాసోహమయ్యారు. ఫలితంగా జీహెచ్ఎంసీ కూల్చిన అక్రమ నిర్మాణాల స్థలంలో మళ్లీ మజ్లిస్ నేతలు నిర్మాణాలు చేపట్టినా చేష్ఠలుడిగి చూస్తుండటం సిగ్గు చేటు. రేవంత్ రెడ్డి సీఎంగా, హోం మంత్రిగా ఉన్నా ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని.. వాటిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, పేదలపై లాఠీ ఛార్జ్ చేసి కేసులు పెట్టారు. పాతబస్తీలో మాత్రం అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న అధికారులపై మజ్లిస్ దాడులు చేస్తున్నా కనీసం కేసులు పెట్టలేని అసమర్థ సర్కార్ నడుస్తోంది.


పాతబస్తీని మజ్లిస్ నేతలకు పూర్తిగా ధారాదత్తం చేశారా?. పాతబస్తీలో ఒక రూలు.. ఇతర ప్రాంతాలకు మరో రూల్ అమలు చేస్తున్నారా?. మజ్లిస్ నేతలు పాతబస్తీలో దొంగతనాలు, దోపిడీలు సహా ఏదైనా చేసేందుకు లైసెన్స్ ఇచ్చారా?. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, గోవధ జరుగుతున్నా, లవ్ జీహాద్ పేరుతో హిందువులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది.


పాతబస్తీని అభివృద్ధి చేయడం చేతగాని సీఎం బాసరకు పోయి ఆదిలాబాద్‌ను రూ. వేల కోట్లతో అభివృద్ధి చేస్తాననడం పెద్ద జోక్. ఉపన్యాసాలకే సీఎం రేవంత్ రెడ్డి పరిమితమయ్యారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా... గ్రామాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. పాతబస్తీలో అధికారులు, పోలీసులపై జరుగుతున్న దాడులపై సీఎం వెంటనే స్పందించాలి. లేనిపక్షంలో పాతబస్తీలో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదముంది’ అని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. పాతబస్తీలో బెంగాలీ కుటుంబాలతో సమావేశానికి ముందు హైకోర్టు సమీపంలోని మురళీదర్ ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్యాంక్‌లో నగదు దాచుకున్నట్లు నీటిని భూమిలో దాచుకోవాలి: సీఎం చంద్రబాబు

కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ

Read Latest TG News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 09:32 PM