Share News

బ్యాంక్‌లో నగదు దాచుకున్నట్లు నీటిని భూమిలో దాచుకోవాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:59 PM

బ్యాంక్‌లో నగదు దాచుకున్నట్లు మనం నీటిని భూమిలో దాచుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

బ్యాంక్‌లో నగదు దాచుకున్నట్లు నీటిని భూమిలో దాచుకోవాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అనంతపురం, ఏప్రిల్ 06: బ్యాంక్‌లో నగదు దాచుకున్నట్లు మనం నీటిని భూమిలో దాచుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో సీఎం పర్యటించారు. నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకోవడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని స్పష్టం చేశారు. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి.. నిలబడిన నీటిని నిల్వ చేయాలి.. జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం వంటివి గతంలో చేపట్టామని వివరించారు.


నీటి కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామని ఏపీ సీఎం గుర్తు చేశారు. నీటి భద్రతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రైతులు, సాగునీటి సంఘాలకు సూచించారు. మైక్రో ఇరిగే‌షన్‌లో తాము చేసింది.. దేశం మొత్తం అనుసరించిందన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో నంబర్ వన్‌గా ఉన్నామన్నారు.


డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని సీఎం చంద్రబాబు చెప్పారు. హార్టికల్చర్‌లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. గత ఏడాది వేసవి ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే.. ప్రస్తుతం అవి 11 మీటర్లే ఉన్నాయని తెలిపారు.


వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతు, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా నీరు చూడాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అలా చేయగలిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉండదన్నారు. రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.


రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు నీరు అవసరమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు 28, తాగు నీటికి 158 టీఎంసీల చొప్పున మొత్తంగా 1,300 టీఎంసీల వరకూ మనకు అవసరం అవుతాయని వివరించారు. ఈ ఏడాదిలో 74 టీఎంసీల నీరు అనంతపురం వరకూ తీసుకు వచ్చామని ఆయన గుర్తు చేశారు.


వైసీపీపై నిప్పులు చెరిగిన సీఎం..

గత పాలకులు మనకు అడ్రస్ లేకుండా చేశారంటూ వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని.. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం అని పేర్కొన్నారు.

పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు రాజధాని అమరావతికి మద్దతు పలికాయని సీఎం చంద్రబాబు వివరించారు. ఒక్క దిక్కు మాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి ముదిరి మావిగన్ అనే పేరు తెరపైకి తెచ్చారని వైసీపీ అధినేతపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.


రాజధాని అమరావతి అని పలకడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు మావిగన్ అంటున్నారని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు. బాబాయిని చంపి తన చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారంటూ వైసీపీ నేతల వైఖరిని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎండగట్టారు. రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. అవి చూసి సహించలేకే ఈ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.


రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేతల తీరుపై ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జలధారతో ప్రతి ఎకరానికీ జలహారతి ఇచ్చేలా కార్యాచరణ చేపడదామని ప్రజలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ.. తీర్పు వాయిదా వేసిన కోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 06:28 PM