మందుబాబులపై యుద్ధ బాంబు!
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:36 AM
ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై పడనుంది. అవును రాష్ట్రంలోని మద్యం ప్రియులపై ఈ వేసవిలో ధరల బాంబు పడబోతుంది.
రాష్ట్రంలో పెరగనున్న మద్యం, బీర్ల ధరలు
గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గడం,ధరల సమీక్ష గడువు ముగియడమే కారణాలు
ఉత్పత్తి ఖర్చులు పెరిగాయంటున్న కంపెనీలు
12 -15 శాతం దాకా రేట్లు పెంచాలని డిమాండ్
మేలో ధరలు పెరిగే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై పడనుంది. అవును రాష్ట్రంలోని మద్యం ప్రియులపై ఈ వేసవిలో ధరల బాంబు పడబోతుంది. మద్యంతోపాటు బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశం అధికంగా ఉంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తవ్వడం ఇందుకు ప్రధాన కారణాలు. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గడువు ఎప్పుడో ముగిసింది. మరోపక్క, యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. సహజవాయువు కొరత వల్ల గాజు సీసా తయారీ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40 శాతం పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని.. వెంటనే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసిన తయారీదారులు మద్యం ధరలను 12- 15శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ఓ రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, మద్యం పెంపును అయిదు స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశముంది. బాటిల్ సైజ్ (90 ఎంఎల్/ 180 ఎంఎల్/ 375ఎంఎల్/ 750 ఎంఎల్), బ్రాండ్/ ప్రైస్ రేంజ్ స్లాబ్ (లో కాస్ట్ లిక్కర్, మిడ్ రేంజ్, ప్రీమియం బ్రాండ్స్), ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్‌ని ఆధారంగా చేసుకుని ధరల పెంపునకు కసరత్తు జరుగుతోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటిస్తుందని అంటునాు.
బీర్ల ధరలకు మళ్లీ రెక్కలు?
ముఖ్యంగా బీర్ల విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం బీర్ల ధరలను 15శాతం పెంచింది. అయితే, ప్రస్తుతం సీసాల కొరతకు తోడు అల్యూమినియ క్యాన్ల ధరలు కూడా పెరగడంతో బీర్ల ధరలను మళ్లీ పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. వేసవిలో బీర్లకు డిమాండ్ 30శాతం వరకు పెరుగుతున్న తరుణంలో సరఫరా మాత్రం 20శాతం మేర తగ్గడం మార్కెట్‌లో కొరతకు దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో కొరత కనిపించకపోయినా.. కొన్ని వర్గాల్లో సరఫరా మందగిస్తున్నట్లు సమాచారం. ఏటా రూ.40వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే మద్యం రంగంపై యుద్ధ ప్రభావం అధికారులను కలవరపెడుతోంది. సరఫరాలో అంతరాయాల ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాద ఉందని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది. మొత్తానికి ఎక్కడో జరుగుతున్న యుద్ధం.. రాష్ట్రంలోని మందుబాబుల జేబులకు చిల్లు పెట్టబోతోంది.