Share News

మోకిలా భూములు.. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు?

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:18 AM

హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మోకిలాలో అభివృద్ధి చేసి, విక్రయించిన భూముల రిజిస్ట్రేషన్లు జాప్యమవుతున్నాయి.

మోకిలా భూములు.. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు?
Mokila HMDA Plots

  • హెచ్‌ఎండీఏ నుంచి ఈ-వేలంలో కొన్నవారి నిరీక్షణ

  • గతంలో ప్లాట్లకు సులువుగానే రిజిస్ట్రేషన్‌

  • ఇటీవల విక్రయించినవాటికి మాత్రం ఇబ్బంది..

  • ఆ సర్వే నంబర్లలో కొంతమేర 22ఏలో ఉందని రిజిస్ట్రేషన్లకు నిరాకరిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌

  • కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ అందకపోవడమే కారణం

  • త్వరలో పరిష్కారం లభిస్తుందంటున్న హెచ్‌ఎండీఏ అధికారులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మోకిలాలో అభివృద్ధి చేసి, విక్రయించిన భూముల రిజిస్ట్రేషన్లు జాప్యమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ఈ లేఅవుట్లలో స్థలాలను ఆన్‌లైన్‌ ఈ-వేలంలో కొని, డబ్బులు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూడాల్సి రావడం ఇబ్బందిగా మారింది. లేఅవుట్లలో కొంత స్థలానికి రెవెన్యూ అధికారులు క్లియరెన్స్‌ ఇవ్వలేదని, ఇంకా నిషేధిత జాబితాలో ఉండటంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఆలస్యమవుతోందని హెచ్‌ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారి అనుకుని మోకిలా వద్ద హెచ్‌ఎండీఏ 165.37 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన రోడ్లతో 1,293 ప్లాట్లు వచ్చేలా భారీ లేఅవుట్‌ను చేపట్టింది. అభివృద్ధి చేసిన కొద్దీ ప్లాట్లను వేలం వేస్తూ వస్తోంది.


ఇప్పటివరకు 700కుపైగా ప్లాట్లను విడతల వారీగా ఈ-వేలంలో విక్రయించింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వందకుపైగా ప్లాట్లను విక్రయించింది. ఇందులో అత్యధికంగా చదరపు గజానికి రూ.1,09,500 చొప్పున ధర పలకడం గమనార్హం. ఈ ప్లాట్లను కొనుగోలు చేసినవారిలో చాలా వరకు చెల్లింపులు పూర్తిచేశారు. అయినా రిజిస్ట్రేషన్లు చేయించకపోవడంతో హెచ్‌ఎండీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మోకిలాలో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లోని భూములు కొంతమేర ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఉన్నాయి. నాలుగు ఫేజ్‌ల్లోని ఈ లేఅవుట్‌లో ఒకటి, రెండు ఫేజ్‌లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.


మూడు, నాలుగు ఫేజ్‌ల్లోని ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్‌ 96/పీలోని కొన్ని భూములు 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయి. హెచ్‌ఎండీఏకు లేఅవుట్‌ అభివృద్ధి కోసం అప్పగించిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితా నుంచి తొలగించలేదు. హెచ్‌ఎండీఏ అధికారులు ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే.. ఇంకా నిషేధిత జాబితాలోనే ఉన్నాయంటూ తిరస్కరణ ఎదురవుతోంది. రెవెన్యూ అధికారులు ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్‌ రావాలి, తర్వాత కలెక్టర్‌ నిరభ్యంతర పత్రం జారీ చేయాలి. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు.


క్యాబినెట్‌ ఆమోదంతో ఉత్తర్వులపై దృష్టి

సొమ్ము చెల్లించాక కూడా రిజిస్ట్రేషన్లు కాకపోవడం వల్ల హెచ్‌ఎండీఏ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీనిపై రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారుల మధ్య చర్చ జరిగింది. రెవెన్యూ అధికారులు జారీచేసే ప్రత్యేక సర్య్కులర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరపాలని తొలుత భావించారు. సర్య్కులర్‌ సైతం తీసుకొచ్చారు. కానీ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలిసింది. దీనితో క్యాబినెట్‌ ఆమోదం ద్వారా ప్రత్యేకంగా ఉత్తర్వులు తీసుకురావాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, త్వరలో జరిగే క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ త్వరలో పూర్తవుతుందని, ఆందోళన అవసరం లేదని అంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 04:19 AM