Share News

సభ బయటి పరిణామాలూ కీలకమే!

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:46 AM

దానం నాగేందర్‌పై అనర్హత వేటు తీర్పులో హైకోర్టు పేర్కొన్న కీలక అంశం చర్చనీయాంశమైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సభ లోపల ప్రవర్తించే తీరు మాత్రమే కాదు.. సభ బయట ప్రవర్తించే తీరు, సభ బయట జరిగే పరిణామాలు సైతం కీలకమే అన్న అంశం హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.

సభ బయటి పరిణామాలూ కీలకమే!
Danam Nagender

  • కండువాలూ, పార్టీకి వ్యతిరేక ప్రచారమూ లెక్కలోకే

  • దానం కేసులో స్పీకర్‌ తీర్పును తప్పుపట్టిన హైకోర్టు

  • ఆయనకు స్వతంత్ర దర్యాప్తు బాధ్యత ఉందని స్పష్టీకరణ

  • మరో 8 మంది ఎమ్మెల్యేల విషయంలోనూ ఈ తీర్పు ప్రభావం?

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్‌పై అనర్హత వేటు తీర్పులో హైకోర్టు పేర్కొన్న కీలక అంశం చర్చనీయాంశమైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సభ లోపల ప్రవర్తించే తీరు మాత్రమే కాదు.. సభ బయట ప్రవర్తించే తీరు, సభ బయట జరిగే పరిణామాలు సైతం కీలకమే అన్న అంశం హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది. సభ లోపల అధికార పక్షం వైపు కూర్చోకుండా ఉంటే సరిపోదని.. సభ బయట సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది కూడా కీలకమే అని తెలుస్తోంది. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలోనూ సభ బయట వారు ఎలా ప్రవర్తించారు? అన్నది కీలకంగా మారుతుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ సభ బయట జరిగిన పరిణామాలతో తనకు సంబంధం లేదని స్పీకర్‌ తీసుకున్న ప్రధాన వైఖరి సమంజసం కాదని హైకోర్టు తేల్చింది.


సభ బయట జరిగిన పరిణామాలు, సభ బయట ఎమ్మెల్యేల ప్రవర్తన సైతం స్పీకర్‌ పరిధిలోకే వస్తాయని చాలా స్పష్టంగా పేర్కొంది. పిటిషన్లో పేర్కొన్న అంశాలతో సంబంధం లేకుండా స్వతంత్ర దర్యాప్తు చేయాల్సిన బాధ్యత స్పీకర్‌కు ఉంటుందని చెప్పింది. ఇందుకు ‘డాక్టర్‌ మహాచంద్ర ప్రసాద్‌ సింగ్‌ ’ తీర్పును ఉదాహరణగా చూపింది. సభ బయట జరిగిన పరిణామాలు కూడా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ పేరా 2(1)ఏ కిందకే వస్తాయని.. స్పీకర్‌ (పదో షెడ్యూల్‌ ట్రిబ్యునల్‌)కు వాటిపై పరిధి ఉంటుందని సుప్రీంకోర్టు ‘డాక్టర్‌ మహాచంద్ర ప్రసాద్‌ సింగ్‌ ’ తీర్పులో విస్తృతంగా చర్చించింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ వైఖరి తప్పని హైకోర్టు తేల్చింది. అలాగే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ పార్టీపరంగా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని, . దానంను అధికారిక సభ్యుడిగానే కొనసాగించిందని చేసిన వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. పార్టీపరంగా చర్యలు తీసుకోనంత మాత్రాన అనర్హత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది.


పదో షెడ్యూల్‌ పేరా2(1)ఏ ప్రకారం కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేయడానికి నామినేషన్‌ వేసిన నాటి నుంచే బీఆర్‌ఎస్‌ సభ్యత్వం కోల్పోయినట్లు భావించాలని పేర్కొంది. దానం నాగేందర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఇతర కాంగ్రెస్‌ లీడర్లను కలవడం, మూడు రంగుల కండువా కప్పుకోవడం, కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా నామినేసన్‌ వేయడం, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, సోషల్‌ మీడియా, టీవీ ఛానెల్స్‌లో స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం వంటివన్నీ పదో షెడ్యూల్‌ ప్రకారం ప్రతివాది దానం నాగేందర్‌ తన సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం కిందకే వస్తాయని హైకోర్టు తేల్చింది. దానం నాగేందర్‌ తన లాయల్టీని మార్చుకున్నట్లు ఆధారాలు లేవని.. కేవలం మీడియాలో, పత్రికల్లో వచ్చిన వార్తలు ఆధారాలు కావని స్పీకర్‌ పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఖైరతాబాద్‌ గణేశుడికి ఉన్నంత పేరు నాకొచ్చింది
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 03:46 AM