మరో సంక్షోభం
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:13 AM
పొగాకు మార్కెట్ గాడిన పడి, వేలం సజావుగా కొనసాగుతున్న తరుణంలో అధిక పంట ఉత్పత్తిపై అపరాధ రుసుం విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. సాధారణంగా అధికారికంగా బోర్డు అనుమతించిన పంట కొనుగోలు పూర్తి సమయానికి అధికోత్పత్తి విషయంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తుంది.
పొగాకు వేలం గాడిన పడుతున్న వేళ
అపరాధ రుసుంపై అయోమయ పరిస్థితి
ఈ సీజన్‌కు కూడా రద్దు కోరుతున్న రైతులు
ఆ మేరకు కేంద్రానికి నివేదించిన బోర్డు
నెల గడుస్తున్నా స్పష్టత ఇవ్వని
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ
ఇప్పటికే మూడు కేంద్రాల్లో పూర్తయిన
అధికారిక పంట కొనుగోళ్లు
మరో రెండుచోట్ల చివరి దశకు చేరిక
ఆందోళన చెందుతున్న రైతులు
ఏమీ చెప్పలేని స్థితిలో బోర్డు అధికారులు
పొగాకు మార్కెట్ గాడిన పడి, వేలం సజావుగా కొనసాగుతున్న తరుణంలో అధిక పంట ఉత్పత్తిపై అపరాధ రుసుం విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. సాధారణంగా అధికారికంగా బోర్డు అనుమతించిన పంట కొనుగోలు పూర్తి సమయానికి అధికోత్పత్తి విషయంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తుంది. అయితే ఈ ఏడాది పొగాకు బోర్డు అధికారులు ముందుగానే అప్రమత్తమై కేంద్రానికి నివేదించి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకూ అక్కడి నుంచి తగు ఆదేశాలు రాలేదు. దీంతో అనుమతించిన పంట కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలలో తదుపరి కొనుగోలుకు అవకాశం లేక వేలం నిలిపేశారు. అలా ఇప్పటికే దక్షిణాదిలో మూడుచోట్ల వేలం ఆగిపోగా.. రెండు మూడు రోజులలో మరో రెండుచోట్ల నిలిచిపోనుంది.
ఒంగోలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌లో మరోసారి సంక్షోభ పరిస్థితి నెలకొంది. పంట అధికోత్పత్తిపై అపరాధ రుసుం విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడమే అందుకు కారణమైంది. పొగాకు పంట సాగు, ఉత్పత్తి, అమ్మకాలు ఇలా అన్నీ పొగాకు బోర్డు నియంత్రణలో సాగాలి. రైతులు అనుమతి మేరకే పంట ఉత్పత్తి చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగే పంట కావడంతో అనుమతించిన దానికన్నా 10 శాతం అధిక ఉత్పత్తి వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేస్తారు. అంతకు మించితే అపరాధ రుసుం విధించి బోర్డు ద్వారా కొనుగోలు చేస్తారు. అలా మూడేళ్ల క్రితం వరకు అధికోత్పత్తిపై 15 శాతం, ఆ తరువాత 10 శాతం, అనంతరం 5 శాతం అలా తగ్గిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులలో గత రెండేళ్ల అపరాధ రుసుంను పూర్తిగా రద్దు చేశారు.
ఆరంభం నుంచి ప్రతికూలమే
ఈ ఏడాది తిరిగి అపరాధ రుసుం విధింపునకు పొగాకు బోర్డు అధికారులు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా సిద్ధమయ్యారు. అయితే గత మూడేళ్లతో పోల్చితే ఈసీజన్‌లో మార్కెట్ తీవ్ర ప్రతికూలంగా సాగుతోంది. వేలం ప్రారంభించి ఆరు మాసాలు గడుస్తున్నా పండిన పంటలో సగం మించి కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. మార్కెట్ ఆరంభం నుంచే ఒడిదొడుకులు ఎదుర్కొంది. ధరలు లేక, అసలు కొనేవారు లేక నిత్యం సగం బేళ్లు నోబిడ్ అవుతూ తీవ్ర సంక్షోభంలోకి మార్కెట్ వెళ్లడంతో రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నేపఽథ్యంలో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు రెండు మాసాలపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కసరత్తు చేశాయి. పలు చర్యల అనంతరం విదేశీ ఆర్డర్ల ఖరారుపై కొంత స్పష్టతతో వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. మీడియం, లోగ్రేడ్ ధరల్లో కదలిక వచ్చింది. అలాగే గ్రేడ్‌ల వారీ కనిష్ఠ ధరలపై స్పష్టతతో నోబిడ్‌లు తగ్గాయి. అలా గత నెలరోజులుగా మార్కెట్ సజావుగా సాగడంతో అటు బోర్డు అధికారులు, ఇటు రైతులు, ప్రభుత్వాలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి.
అపరాధ రుసుంపై ఆందోళన
ఈ తరుణంలో అపరాధ రుసుం విషయంలో నెలకొన్న అయోమయంతో మరోసారి మార్కెట్‌లో సంక్షోభ పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది తొలుత మార్కెట్ తీవ్ర ప్రతికూలంగా సాగిన సమయంలో అందుకు ప్రధాన కారణం అధిక పంట ఉత్పత్తిగా ఇటు బోర్డు, అటు ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో వచ్చే సీజన్ (2026-27)కు ఉత్పత్తి పరిమాణాన్ని భారీగా తగ్గించాయి. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో 142 మిలియన్ కిలోలకు అనుమతి ఉంటే 230 మిలియన్ కిలోలు, అలాగే దక్షిణాదిలో 90.50 మిలియన్ కిలోలకు అనుమతిస్తే 142 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అయినట్లు అంచనా. దీంతో వచ్చే ఏడాది అధికారికంగా 81 మిలియన్ కిలోలకు మాత్రమే బోర్డు అనుమతి ఇచ్చింది. అంటే దాదాపు 43శాతం కోత విధించింది. దక్షిణాదిలో అలాగే కోత పెట్టింది. అంతకంటే ఉత్పత్తి పెరగకుండా నారుమడులు నుంచే బోర్డు అధికారులు దృష్టి సారించారు. అదే సందర్భంలో ప్రస్తుత సీజన్‌లో అధికంగా పండిన పంటపై కూడా భారీగా అపరాధ రుసుం విధించడం ద్వారా వచ్చే సీజన్‌లో అధిక ఉత్పత్తి జరగకుండా చేయాలని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ సూచనలతో బోర్డు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే మార్కెట్‌లో ధరలు లేక నష్టపోతున్న రైతులకు పిడుగుపాటులా ఆ నిర్ణయం ఉండటంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
నెలరోజులైనా స్పష్టత కరువు
అపరాధ రుసుం విషయంపై గతనెల 18న ‘పొగాకు రైతుల్లో అలజడి’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కఽథనం ప్రచురితం కావడంతో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్ స్పందించి సీఎం కార్యాలయం అధికారులు, బోర్డు అధికారులతో మాట్లాడారు. ఈ సీజన్‌కు అపరాధ రుసుం లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు. తదనుగుణంగా అపరాధ రుసుం మినహాయించి అధిక ఉత్పత్తి కొనుగోళ్లకు అనుమతించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరుతూ బోర్డు అధికారులు నివేదించారు. ఆ ప్రతిపాదనలు పంపి నెలరోజులు గడుస్తున్నా అక్కడి నుంచి స్పష్టత రాలేదు. ఈలోపు దక్షిణాదిలోని కలిగిరి, డీసీపల్లి, కనిగిరి కేంద్రాలలో అధికారిక పంట కొనుగోళ్లు పూర్తికావడంతో తదుపరి కొనుగోళ్లకు అనుమతిలేక బోర్డు అధికారులు వాటిలో వేలం నిలిపేశారు. అలాగే ఒంగోలు-2, పొదిలిలోనూ రెండు రోజుల్లో అధికారిక కొనుగోళ్లు పూర్తయి వేలం ఆగిపోనుంది. మిగతా వాటిల్లోనూ మరో వారం తరువాత ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
వేలం కొనసాగించాలంటూ రైతుల డిమాండ్
అపరాధ రుసుం లేకుండా అధిక పంటను కొనుగోలుకు అనుమతి ఇచ్చి వేలం కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వేలం కేంద్రాల రైతు కమిటీల ప్రతినిధులు గత నెలలో ఒంగోలు వచ్చిన మంత్రి లోకేష్, అనంతరం జిల్లా కు చెందిన మంత్రులు డాక్టర్ స్వామి, రవికుమార్‌లను, అలాగే రెండు రోజులు క్రితం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అయినా కదలిక కనిపించ లేదు. ఈక్రమంలో తొలి నుంచి రైతుల పక్షాన పెద్దఎత్తున జిల్లాలో ఉద్యమాలు నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా తరఫున రైతు సంఘాల నాయకులు శుక్రవారం గుంటూరులో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, ఇతర అధికారులను కలిసి ఇదే విషయంపై వినతిపత్రం అందజేసి చర్చించారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘాల నాయకులు కేవీవీ ప్రసాద్, పరిటాల కోటేశ్వరరావు, జె.జయంత్‌బాబు, హనుమారెడ్డి, కె.హనుమంతరావు, శింగయ్య ఈడీని కలిసిన వారిలో ఉన్నారు. తక్షణం కేంద్రం నుంచి తగు అనుమతులు రాకపోతే పల ుకేంద్రాలలో వేలం నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.