Share News

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:34 AM

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, శ్రీరాంసారగ్, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ల్లోకి వరద ప్రవాహం అధికంగా ఉంది.

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో
Telangana Heavy Rains

హైదరాబాద్, జులై 30: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ల్లోకి వరద ప్రవాహం అధికంగా ఉంది. అటు భద్రాచంలోనూ గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా గోదావరి నీటిమట్టం 27.4 అడుగులకు చేరింది. భారీ వర్షాలకు పలు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


317.35 మీటర్లకు జూరాల నీటిమట్టం

మహబూబ్‌‌‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ఇన్‌ ఫ్లో 91 వేల క్యూసెక్కులు, ఔవుట్ ఫ్లో 81,695 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 317.35 మీటర్లుగా కొనసాగుతోంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.371 టీఎంసీలుగా నమోదు అయ్యింది. భారీ వరద నేపథ్యంలో ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 6,250 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1065 అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం16 టీఎంసీలుగా నమోదు అయ్యింది.


నిజాంసాగర్‌ ఇన్‌ఫ్లో 3935 క్యూసెక్కులు

అటు నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి 3935 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1405 అడుగులు, కెపాసిటీ 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1395.83 అడుగులు, 7.146 టీఎంసీలుగా నమోదు అయ్యింది. గత సంవత్సరం ఇదే రోజు 4.622 టీఎంసీలు, 1391.30 అడుగులుగా ఉంది.


సింగూరుకు స్వల్పంగా వరద

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో - 517 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో - 470 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటినిల్వ 4.249 టీఎంసీలుగా నమోదు అయ్యింది.


నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లిలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ 2, 3 బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రెండు రోజులుగా గనుల్లో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణికి 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.


వికారాబాద్-పరిగి రాకపోకలకు అంతరాయం

వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ - పరిగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మద్గుల్ చిట్టెంపల్లి వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రవాణా స్తంభించింది. తాత్కాలిక బ్రిడ్జి పైనుంచి మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టారు. పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై వాహనాలను తాత్కాలికంగా మన్నెగూడ మీదుగా దారి మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

డ్రగ్స్ రాకెట్‌ కేసులో ఉగాండాకు చెందిన లేడీడాన్ అరెస్టు

నల్లబడిన నూనెతో పానీపూరీలు.. అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీజ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 01:51 PM