Share News

వినికిడి లోపంతో ఏటా 8 లక్షల కోట్ల నష్టం!

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:32 AM

వినికిడి లోపం అనేది ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ గండి కొడుతోందని తాజా పరిశోధన హెచ్చరించింది.

వినికిడి లోపంతో ఏటా 8 లక్షల కోట్ల నష్టం!
Ear

  • భారత్‌లో 28.9 కోట్ల మందికి శ్రవణ సమస్యలు

  • అందులో 8.6 కోట్ల మందికి తీవ్ర చెవుడు

  • వారికి తోడుండే కుటుంబ సభ్యుల సమయమూ వృథా

  • తాజా పరిశోధనలో దిగ్ర్భాంతికర నిజాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వినికిడి లోపం అనేది ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ గండి కొడుతోందని తాజా పరిశోధన హెచ్చరించింది. వినికిడి సమస్యల వల్ల భారత్‌ 2024లో ఏకంగా రూ.8 లక్షల కోట్ల మేర నష్టపోయిందని చెన్నైకి చెందిన కొనాస్కా ఇన్‌సైట్స్‌, శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌, ప్రజ్ఞాన్‌ సస్టైనబుల్‌ హెల్త్‌ ఔట్‌కమ్స్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయంనంలో వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 28.90 కోట్ల మంది ఏదో ఒక స్థాయి వినికిడి లోపంతో బాధపడుతుండగా, వారిలో 8.59 కోట్ల మంది తీవ్రమైన చెవుడు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏటా పుడుతున్న 2.30 కోట్ల మంది పిల్లల్లో సుమారు లక్షన్నర మంది (0.6 శాతం) వినికిడి లోపంతోనూ, మరో 0.1 శాతం మంది పూర్తిస్థాయి చెవుడుతోను జన్మిస్తున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లల్లో దాదాపు 4.85 కోట్ల మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఇక ఉపాధి పొందే వయసున్న (18-60 ఏళ్లు) వారిలో 14.44 కోట్ల మంది వినికిడి సమస్యలతో, 3.30 కోట్ల మంది తీవ్ర చెవుడుతో ఇబ్బంది పడుతున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి, 63 శాతం మంది (9.62 కోట్ల మంది) వినికిడి సమస్యను, 35 శాతం మంది (5.28 కోట్ల మంది) తీవ్ర చెవుడును ఎదుర్కొంటున్నారు.


ఉద్యోగాలు దొరక్క వేల కోట్ల ఆదాయం గాల్లోకి..

పనిచేసే వయసున్న వారికి తీవ్ర వినికిడి లోపం ఉండటం వల్ల సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఉద్యోగావకాశాలు 12.5 శాతం నుంచి 16.5 శాతం వరకు తగ్గుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతుండటంతో దేశం ఏటా నేరుగా రూ.4.64 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ బాధితులను చూసుకోవడానికి కుటుంబ సభ్యులు తమ పని సమయాన్ని వెచ్చించాల్సి రావడంతో, వారి ఉత్పాదకత తగ్గి దేశానికి రూ.3.72 లక్షల కోట్ల మేర పరోక్ష నష్టం వాటిల్లుతోంది. ఈ రెండు రకాల నష్టాలు కలిపి దేశంపై ఏటా రూ.8 లక్షల కోట్ల మేర భారం మోపుతున్నాయి.


చదువుల్లో వెనుకబాటుతో మరో రూ.లక్ష కోట్ల లోటు

చిన్నతనంలోనే వినికిడి లోపం ఉండటం వల్ల మాటలు రాకపోవడం, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తి దాదాపు 3.35 కోట్ల మంది ప్రాథమిక విద్యకే పరిమితమవుతున్నారు. దీనివల్ల వారు భవిష్యత్తులో సరైన ఉద్యోగాలు సాధించలేక తక్కువ సంపాదనతో మిగిలిపోతున్నారు. ఈ విద్యా లోటు వల్ల ఏటా అదనంగా రూ.1.22 లక్షల కోట్ల నష్టం జరుగుతోందని పరిశోధకులు తేల్చారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో వినికిడి లోపం నష్టాన్ని దాదాపు 90.6 వేల కోట్లుగా అంచనా వేసినప్పటికీ, అది బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల సమాచార ఆధారిత ఊహాగానమేనని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. భారతీయ వాస్తవ జనాభా, స్థానిక ఉద్యోగ పరిస్థితులు లెక్కిస్తే అసలు నష్టం 5.18 లక్షల కోట్లకు పైమాటేనని తేలింది. దేశంలో ఆడియాలజిస్టులు, ఈఎన్‌టీ క్లినిక్కుల కొరత కారణంగా సమస్యను ప్రారంభంలోనే గుర్తించలేకుపోతున్నామని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు పుట్టిన వెంటనే వినికిడి పరీక్షలు నిర్వహించడం, గ్రామీణ స్థాయిలో ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా టెలి-డయాగ్నసిస్‌ ేసవలను విస్తరించడం అత్యవసరమని సూచించారు. బాధితులకు వినికిడి యంత్రాలు అందంచడంతో పాటు, కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌, బధిర పాఠశాలలు, ఆధునిక పునరావాస పద్ధతుల ద్వారా వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు

ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 07:32 AM