50 వేలు కట్టి చేరితే రోజుకు రూ.700 ఆదాయం!
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:02 AM
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి వందలాది మంది నిండా మునిగారు.
యాప్‌లో పెట్టుబడి పేరుతో భారీ ట్రేడింగ్ మోసం
హయత్‌నగర్‌లో 500 మంది నుంచి 5 కోట్లు వసూలు..!
న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
హయత్‌నగర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి వందలాది మంది నిండా మునిగారు. ఒక్కసారి రూ.50 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.700 ఆదాయం వస్తుందని ఆశపడి.. కమీషన్ కోసం తెలిసిన వారితోనూ పెట్టుబడి పెట్టించి.. చివరకు అంతా మోసపోయి లబోదిబోమంటున్నారు. హయత్‌నగర్‌లోని సీఎ్‌సఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరప్ప క్వాంట్ వెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ (క్యూవీఎ్‌సఈ) యాప్‌కు ఏజెంటునని ప్రచారం చేసుకున్నాడు. తాను ఇచ్చిన రిఫరెన్స్‌తో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రూ.50 వేలు పెట్టుబడి పెడితే రోజుకు 6 డాలర్ల (సుమారు రూ.700) వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. యాప్ కావాల్సిన వారి నుంచి రూ.3 వేలు కమీషన్ తీసుకొని యాప్ లింక్ ఇచ్చే వాడు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు రూ.50 వేలు పెట్టుబడి పెడితే రోజుకు 6 డాలర్లు ఖాతాలో జమవుతున్నట్లు అందులో కనిపించేది.
ఈ నేపథ్యంలోనే సీఎ్‌సఆర్ కాలనీకి చెందిన మండలి భారతి, రాములు, గోపాల్, పద్మతో పాటు పలువురు డబ్బు కట్టి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. లాభాలు వచ్చినట్లు యాప్‌లో కనిపించడంతో రూ.3 వేల కమీషన్ కోసం స్నేహితులు, పొరుగు వారికి చెప్పి యాప్ డౌన్‌లోడ్ చేయించారు. ఇలా ఒకే కాలనీకి చెందిన సుమారు 500 మంది ఒకరి ద్వారా మరొకరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సుమారు రూ.5 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టారు. అయితే అందులో లాభాలు కనిపించినా, విత్‌డ్రాకు ఆప్షన్ లేకపోవడం, యాప్ పనిచేయకపోవడంతో అంతా మోసపోయామని గ్రహించారు. ఆ యాప్ ఏజెంట్ వెంకటేశ్వరప్ప ఇంటి ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. సోమవారం అంతా కలిసి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వెంకటేశ్వరప్పపై ఫిర్యాదు చేశారు. యాప్ ఏజెంట్‌గా ఉన్న వెంకటేశ్వరప్పపై చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. దీనిపై హయత్‌నగర్ డీఐ సంతో్‌షకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కేసు నమోదు చేయలేదని.. విచారణ అనంతరం ఉన్నధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్..!
కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News