ఆకాశంలో బియ్యం, నిత్యావసరాల ధరలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:39 AM
రాష్ట్రంలో సన్నబియ్యంతో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. ధరల నియంత్రణలో చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం నేలచూపులు చూస్తోందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
నియంత్రణలో రేవంత్ సర్కారు విఫలం: హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సన్నబియ్యంతో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. ధరల నియంత్రణలో చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం నేలచూపులు చూస్తోందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు నియంత్రించాల్సిన సర్కార్ మొద్దునిద్రలో ఉండటం దారుణమని సోమవారం ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తోందని, సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలమైతే, బియ్యం ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయి? మీరిచ్చే నాణ్యతలేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాక మరేమిటని నిలదీశారు.
‘రైతుకు గిట్టుబాటు ధర లేదు. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులే. కళ్ళముందే ఈ తతంగం అంతా జరుగుతుంటే, ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు’ అని ప్రశ్నించారు. బియ్యం మాత్రమేకాదు.. కిలో ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లీనూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 ఇలా.... అడ్డగోలుగా ధరలు పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు వెంటనే నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలోని కీలక ప్రాజెక్టులకు సహకరించండి
సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌పై తప్పుడు ప్రచారం
Read Latest Telangana News And Telugu News