ఓటరు కార్డూ సరెండర్ చేయాలి!
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:32 AM
అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరసత్వం తీసుకున్న ప్రవాస భారతీయులకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత భారత పాస్‌పోర్టును సరెండర్ చేయడంతో పాటు ఓటరు కార్డును కూడా వదులుకున్నట్లు హామీ ఇవ్వాలని ..
విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పాస్‌పోర్టుతో పాటు ఓటూ వదులుకోవాలి
ఓటర్ల జాబితాలో తమ పేరు తొలగించినట్లు ప్రవాస భారతీయులు ఆధారాలివ్వాలి
‘సర్’ నేపథ్యంలో భారత ఎంబసీ నిబంధన
ఆ ఆధారాలేంటో చెప్పక ఎన్నారైల్లో అయోమం
ఫారం-7తో సొంతంగా పేరు తొలగించుకునే వీలు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరసత్వం తీసుకున్న ప్రవాస భారతీయులకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత భారత పాస్‌పోర్టును సరెండర్ చేయడంతో పాటు ఓటరు కార్డును కూడా వదులుకున్నట్లు హామీ ఇవ్వాలని భారత రాయబార కార్యాలయాలు కోరుతున్నాయి. భారత్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న నేపథ్యంలో ఈ నిబంధనపై ప్రవాసుల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు భారతీయ పాస్‌పోర్టు అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనంటున్న ప్రభుత్వం మరోవైపు అదే పాస్‌పోర్టును పౌరసత్వానికి ప్రామాణికంగా పరిగణిస్తూ సరెండర్ చేయాలని అడగడం విచిత్రం.
ఇప్పుడు భారత పాస్‌పోర్టుతో పాటు ఓటరు కార్డును కూడా అప్పగించాలని ఎంబసీలు అడుగుతున్నాయి. దీంతో పాటు ఓటర్ల జాబితా నుంచిపేరు తొలగించినట్లుగా ఆధారాలు కూడా చూపాలంటున్నా అవి ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదు. ఫలితంగా ప్రవాసులు సంకటస్థితిలో పడుతున్నారు. విదేశాంగ శాఖ పార్లమెంటుకు ఇచ్చిన వివరాల ప్రకారం 2024లో 2,06,378 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో ఈ సంఖ్య 2,25,620 ఉండగా.. 2023లో 2,16,219 ఉంది. వీరిలో ఎక్కువ మంది అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలను ఎంచుకుంటున్నారు. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నా, అక్కడ పౌరసత్వం దాదాపు లభించదు. దీంతో గల్ఫ్‌లో ఉన్నవారిలోనూ పలువురు పాశ్చాత్య దేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది? : భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. పౌరసత్వ చట్టం-1955 సెక్షన్ 9 ప్రకారం ప్రవాసులెవరైనా విదేశీ పౌరసత్వం తీసుకున్న మరుక్షణమే భారత పౌరసత్వం రద్దవుతుంది. ఆ తర్వాత వారు తాము నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయంలో భారత పాస్‌పోర్టును అప్పగించి సరెండర్ సర్టిఫికెట్ పొందాలి. భారత్‌కు రాకపోకలు సాగించేందుకు అవసరమైన ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)’ కార్డు కావాలంటే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే ఓసీఐ దరఖాస్తుతో పాటు తమ ఓటరు గుర్తింపు కార్డును కూడా సరెండర్ చేశామని హామీ పత్రం సమర్పించాలని రాయబార కార్యాలయాలు స్పష్టం చేస్తున్నాయి. భారత పౌరులు కాని వారికి ఓటు హక్కు ఉండదు కాబట్టి ఈ నిబంధన తెచ్చారు. ఇది సర్ ప్రక్రియకు ముందు నుంచే (2024 చివరి నుంచి) అమల్లో ఉంది. అయితే సర్‌లో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా వడపోస్తుండడంతో దాని నుంచి పేరు తొలగించినట్లు ఆధారాలు కూడా అడుగుతున్నాయని దరఖాస్తుదారులు చెబుతున్నారు.
ఫారం-7తో పరిష్కారం
ఓటర్ల జాబితా నుంచి ఎవరైనా పేరును తొలగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఫారం-7 అందుబాటులో ఉంచింది. ఎన్నికల సంఘం పోర్టల్ ద్వారా విదేశాల నుంచే దీన్ని దాఖలు చేయవచ్చు. దరఖాస్తు చేసిన వెంటనే వచ్చే రిఫరెన్స్ నంబరును, తొలగింపు పూర్తయ్యాక జాబితాలో పేరు లేనట్లు చూపే వివరాలను రాయబార కార్యాలయానికి సమర్పించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. సర్‌లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ‘శాశ్వతంగా వలస వెళ్లారు’ (షిఫ్టెడ్) అని తెలియజేసినా పేరు తొలగిపోతుంది. కానీ దానికి విడిగా ధ్రువీకరణ పత్రం రాదు. అందుకే ఫారం-7 మార్గమే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. భారత పౌరసత్వం ఉండి విదేశాల్లో పనిచేస్తున్న ఎన్నారైలు మాత్రం ఫారం-6ఏ ద్వారా ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు కావచ్చు. ఈ నిబంధన వారికి వర్తించదు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలోని కీలక ప్రాజెక్టులకు సహకరించండి
ఎంబీబీఎస్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్’ అవకాశం
కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి
Read Latest Telangana News And Telugu News