Share News

తెలంగాణలోని కీలక ప్రాజెక్టులకు సహకరించండి

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:26 AM

తెలంగాణలోని పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

తెలంగాణలోని కీలక ప్రాజెక్టులకు సహకరించండి
Komatireddy Nitin Gadkari meeting

  • కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి

  • హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర-దక్షిణ భాగాలపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 05 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఆయా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల మంజూరు, జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఎక్తా నగర్‌ స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ప్రాంగణంలో జరుగుతున్న చింతన్‌ శివిర్‌-2026 రెండు రోజుల కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. మొదటిరోజు సమావేశంలో పలు రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వంటి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో.. మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.


ఈసందర్భంగా సీఎం రేవంత్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రోడ్ల ఇన్‌ఫ్రాపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ వరకు సుమారు 6 కి.మీ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించాలని కోరారు. హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65)రోడ్డులో ఇప్పటికే ఎల్బీనగర్‌-మల్కాపూర్‌ సెక్షన్‌ను సర్వీస్‌ రోడ్లతో సహా 6+2 లేన్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.545 కోట్లతో కేంద్రం అనుమతులు ఇచ్చిందని, మిగిలిన రహదారి విస్తరణను కూడా త్వరితగతిన చేపట్టాలన్నారు. ఈ రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య 1.20 లక్షలకు పైగా చేరుకుందని, అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. మియాపూర్‌- ఎల్బీనగర్‌ మెట్రో రైలు కారిడార్‌ను రెండో దశలో హయత్‌నగర్‌ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మెట్రోతో సమన్వయం ఉండేలా డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు 2026-27 వార్షిక ప్రణాళికలో చోటు కల్పించాలని కోరారు.


అలాగే హైదరాబాద్‌- శ్రీశైలం (ఎన్‌హెచ్‌-765) రోడ్డులో టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉన్న ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తరభాగంలో క్యాబినెట్‌ (ఆర్థిక)ఆమోదం త్వరితగతిన ఇవ్వాలని కోరారు. దక్షిణ భాగాన్ని కూడా ఉత్తరభాగంతో సమాంతరంగా కేంద్రమే చేపట్టాలన్నారు. భారత్‌ ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేకు సంబంధించి డీపీఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సీఆర్‌ఐఎఫ్‌ కింద 2026-27 ఆర్థిక ఏడాదికి గానూ తెలంగాణకు 33 రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు.


511.68 కి.మీ.తో చేపట్టనున్న ఈ పనులకు రూ.1,222.75 కోట్ల అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. కాగా చింతన్‌ శివిర్‌లో రెండోరోజైన మంగళవారం ‘డిజైనింగ్‌ సేఫ్‌ హైవేస్‌.. ఫ్రం స్టాండర్డ్స్‌ ఇంప్లిమెంటేషన్‌’ అనే అంశంపై ప్యానెల్‌ డిస్కషన్‌ నిర్వహించనున్నారు. ఈ ప్యానెల్‌కు ఛైర్మన్‌గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించనుండగా మరో ఆరుగురు సభ్యులుంటారు. ఈ ప్యానెల్‌ డిస్కషన్‌ను ఆయనే ప్రారంభించనున్నారు. నవంబర్‌ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలో నిర్వహించే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) సదస్సుకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ హాజరవుతారని మంత్రి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


ఇవి కూడా చదవండి...
మార్వాడీ వ్యాపారి దారుణ హత్య!

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్‌’ అవకాశం
కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 05:26 AM