సాగర్‌కు పొక్క పెట్టే జీవో రేవంత్ వచ్చాకే!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:07 AM
నాగార్జునసాగర్ నుంచి నీటిని మళ్లించే ప్రతిపాదన బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లేదని, సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇందుకు సంబంధించిన జీవో వచ్చిందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో నీళ్ల మళ్లింపు ప్రతిపాదనే లేదు
పాత జీవోలను చూపించి తప్పుదోవ పట్టిస్తున్నారు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నది కేసీఆరే
700 కి.మీ. దూరంలోని కుప్పానికి కృష్ణా నీళ్లు..
పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం అన్యాయం
సీఎం హోదాలో అబద్ధాలు చెప్తే.. నిజాలైపోవు
ముఖ్యమంత్రిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజం
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ నుంచి నీటిని మళ్లించే ప్రతిపాదన బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లేదని, సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇందుకు సంబంధించిన జీవో వచ్చిందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సాగర్ కింది నుంచి కాల్వ తవ్వి నీటిని తరలించే ప్రతిపాదనకు సంబంధించిన జీవోను పాత జీవోగా చూపిస్తూ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవో నంబర్లను తప్పుగా ప్రస్తావించారని హరీశ్‌రావు విమర్శించారు. 2022లో వచ్చిన జీవో 56లో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించే అంశమే లేదని స్పష్టం చేశారు. ఒంగోలు బ్రాంచ్ కెనాల్ ప్రస్తావనను నాగార్జున సాగర్ కెనాల్‌గా పేర్కొంటూ సీఎం వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాకే జీవో 453 జారీ అయిందని, పాత, కొత్త జీవోలను ఆయన మీడియాముందు ప్రదర్శించారు.
జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన సమయంలోనే తాము దాన్ని వ్యతిరేకించామని హరీశ్ తెలిపారు. 2020 జనవరి 1న అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసిందని గుర్తు చేశారు. 2020లో కేంద్ర మంత్రి షెకావత్ సమక్షంలో కేసీఆర్.. జగన్‌ను ఉద్దేశించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపకపోతే అలంపూర్ వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని అడ్డుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు మద్దతిచ్చారంటూ రేవంత్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2024 డిసెంబరు 3న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 403, 405 ద్వారా కృష్ణా జలాలను 700 కి.మీ దూరంలో ఉన్న కుప్పం వరకు తరలిస్తున్నారన్నారు. తెలంగాణ నీటి హక్కుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన సీఎం.. తమపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
పాలమూరుకు అన్యాయం చేసింది మీరే..
పాలమూరు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో 30వేల ఎకరాలకే సాగునీరు అందించారని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని హరీశ్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక తన సొంత జిల్లాలో అదనంగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 20 లక్షల ఎకరాలకు నీరిస్తామని అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో కనీసం 5 శాతమైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చిందన్నారు. రేవంత్ ప్రభుత్వం కొత్త ఆయకట్టును సృష్టించలేదని, కొత్త ప్రాజెక్టులనూ చేపట్టలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, లిఫ్టుల నిర్వహణ, కొత్తగా సాగునీరు అందించిన వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో చర్చకు సిద్ధం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, 299:512 టీఎంసీల నీటి పంపిణీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ నుంచి నీటి మళ్లింపు తదితర అంశాలపై సీఎం చేసిన వ్యాఖ్యలకు పత్రాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని హరీశ్ ప్రకటించారు. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా అవకాశం ఇస్తే వారం, పది రోజుల పాటు అయినా ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే అడ్డుకున్నానన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారని హరీశ్ పేర్కొన్నారు. ఎన్జీటీలో కేసులు వేసి తెలంగాణ ప్రభుత్వం పనులు నిలిపివేయించిందని, రేవంత్‌రెడ్డి వాటిని అడ్డుకోలేదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
కేసీఆర్ అన్యాయం చేశారనడం సిగ్గుచేటు..
తెలంగాణ హక్కుల కోసం పోరాడిన కేసీఆర్ రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని హరీశ్‌రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం సెక్షన్-3 కింద ట్రైబ్యునల్ విచారణ కోరింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నిర్వహణకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని కేసీఆర్ పట్టుబట్టిన తర్వాతే జీవో జారీ అయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2025 పిబ్రవరి 2న జరిగిన సమావేశంలో 299:512 టీఎంసీల తాత్కాలిక నీటి పంపిణీ ఒప్పందానికి ఒప్పుకున్న విషయాన్ని సీఎం ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెబితే అవి నిజాలైపోవని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని, సీఎం వ్యాఖ్యలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హరీశ్‌రావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మారిషస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..
సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ