నీళ్లడిగిన రైతుల చేతులకు సంకెళ్లా?
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:36 AM
కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా బేసిన్ ద్వారా కుప్పం వరకూ తరలిస్తుంటే.. పక్కనేఉన్న పాలమూరుకు ఎందుకు తరలించడం లేదని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా?
పాలమూరుకు ద్రోహం చేస్తున్న సీఎం రేవంత్
జూరాల నీళ్లడిగిన రైతులను, బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు
చేయడాన్ని ఖండిస్తున్నాం: హరీశ్
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా బేసిన్ ద్వారా కుప్పం వరకూ తరలిస్తుంటే.. పక్కనేఉన్న పాలమూరుకు ఎందుకు తరలించడం లేదని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాన్ని, పాలకుల చేతగానితనాన్ని ప్రశ్నిస్తే.. అరెస్టులు చేసి, నిర్బంధిస్తారా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన నిలదీశారు. ‘‘గడిచిన రెండున్నరేళ్లూ కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా మోటర్లను ఎందుకు నడపలేదు? శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదు? కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గానీ, నీళ్ల మంత్రి ఉత్తమ్ గానీ సమాధానం చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాజెక్టులను పడావు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారని ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి పాలమూరుకు, అక్కడి రైతులకు నమ్మక ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్‌ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారని.. కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఎందుకింత దౌర్జన్యం, రైతులు నీళ్లు అడుగుతుంటే, వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా?’’ అని సీఎంను ప్రశ్నించారు. ‘‘నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేస్తున్న మీరు తప్పుచేస్తే.. శిక్ష రైతులు అనుభవించాలా? రైతులంటే ఎందుకు అంత నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే ఎందుకింత పట్టింపు లేని తనమ’’ని నిలదీశారు. పంట పొలాలు ఎండుతున్నాయన్న అన్నదాతల ఆవేదన కనిపించడం లేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు నీళ్లివ్వడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని, సాకులు చెప్పి తప్పించుకుంటే.. సాగు ముందుకు పోదని మండిపడ్డారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న బీఆర్‌ఎస్ నాయకుల ను, రైతులను విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి
ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News