Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:44 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Harish Rao

  • రైతులకు రూ. 5వేల తక్షణ సాయం అందించాలి

  • మెదక్‌ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం దారుణం: హరీశ్‌

హైదరాబాద్‌/ హత్నూర, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో రైతుల సమస్యలపై కనీసం చర్చించకపోవడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ రూ.5 వేల తక్షణ ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని భీమ్లా తండా, దేవునిగుట్ట తండా, సిరిపురం, నస్తీపూర్‌ గ్రామాల్లో శుక్రవారం హరీశ్‌రావు పర్యటించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌ జిల్లాపై వివక్ష చూపుతున్నార ని ఆరోపించారు. జిల్లాలోని 21 మండలాలకు గాను మనోహరాబాద్‌ మండలాన్నే కరువు మండలంగా ప్రకటించి.. మిగతా రైతులకు అన్యాయం చేశారని అన్నారు. ఏడుపాయల వనదుర్గాదేవి, కొమురవెల్లి మల్లన్న, మెదక్‌ చర్చి సాక్షిగా ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించారని విమర్శించారు. పరిశ్రమలకు లక్షలాది లీటర్ల నీటిని విక్రయిస్తున్న ప్రభుత్వం, ప్రజలకు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. సింగూరు ప్రాజెక్టులో గతంలో 20 టీఎంసీల నీరు ఉండేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం రెండు టీఎంసీలకు పడిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి మూటలు మోసేందుకు నిధులు ఉంటాయి కానీ, కష్టాల్లో రైతులను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 30 శాతం వరి కోతలు పూర్తయినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు.


నేలచూపు చూస్తున్న ఆర్టీసీ ఆత్మగౌరవం

ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్ధిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ కార్మికులతో వ్యవహరించిన తీరుపై ఆయన శుక్రవారం ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. డిపోలోని కార్మికుల సమస్యలపై మాట్లాడానికి వెళ్లిన జేఏసీ నాయకులను, కార్మికులను సిద్ధిపేట డిపో మేనేజర్‌ కింద కూర్చోబెట్టి మాట్లాడుతున్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఆయన.. ‘కార్మికులంటే ఇంత చిన్నచూపా?’ అంటూ అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:44 AM