Share News

భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్‌ చార్జీ!

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:03 AM

ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఉచిత ప్రయాణమని చెప్పి.. భర్తకు డబుల్‌ చార్జీ వసూలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్‌ చార్జీ!
Harish Rao

  • పండుగలొస్తే ప్రజల నడ్డి విరుస్తున్న ఆర్టీసీ

  • జర్మనీలో కొలువులంటూ ప్రభుత్వం మోసం: హరీశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఉచిత ప్రయాణమని చెప్పి.. భర్తకు డబుల్‌ చార్జీ వసూలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రద్దీ ముసుగులో పండగ పూట కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ‘మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఇదేనా ప్రజాపాలన?’ అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్‌ జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌కు రూ.230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ ఎంజీబీఎ్‌సకు మొన్నటి వరకు రూ.220 ఉండగా ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ టికెట్లను ఎక్స్‌లో పోస్టు చేశారు.


పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను రేవంత్‌ సర్కార్‌ నిండా ముంచిందని హరీశ్‌ విమర్శించారు. జర్మనీలో కొలువులంటూ ప్రభుత్వరంగ సంస్థ టామ్‌కామ్‌ ద్వారా 15 జిల్లాల్లోని 75 మంది నిరుద్యోగుల నుంచి వీసాలు, పరీక్షల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.4.50 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా రెండేళ్లుగా మోసం చేస్తున్నారని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఏదైనా సమస్య వస్తే 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్నో కోర్టుకు వెళ్లాలని బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. విదేశీ కొలువుల వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, బాధితులకు నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 19 , 2026 | 06:03 AM