తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలు వెంటనే విరమించాలి: హరీశ్ రావు
ABN , Publish Date - Jun 24 , 2026 | 01:46 PM
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పష్టం చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని సీఎంకు ఆయన సూచించారు.
హైదరాబాద్, జూన్ 24: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పష్టం చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని సీఎంకు ఆయన సూచించారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖను హరీశ్ రావు విడుదల చేశారు.
‘సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరవును పారద్రోలి, పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసింది’.
‘అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోంది. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందిస్తున్న మీరు, ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో వ్యవహరిస్తున్నారు’.
‘పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు, అదే ప్రాంతంలోని రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసం? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి ఎన్‌వోసీ (NOC) తెస్తున్నాం అనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా? తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 TMC), చిక్కాలపర్వి (2.5 TMC), చిక్కాలమంచి (5 TMC) బ్రిడ్జ్-కమ్-బరాజ్‌లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?’
‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయన్న విషయం మీకు తెలియదా? లేక తెలిసే ఇదంతా చేస్తున్నారా? రాయచూర్ జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతల పథకాన్ని రూ.85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇన్టేక్ నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తి అయితే మీరు, మీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా? ఈ అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదు?’
‘సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? దీని వెనుక ఉన్న లోపాయికారి ఒప్పందాలు ఏమిటి?’
‘ఇప్పటికే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు సరిగా అందని పరిస్థితి ఉంది. కర్ణాటక తనకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తోంది. ఆర్డీఎస్‌లో కర్ణాటక వాటా1.2 టిఎంసి మాత్రమే. కాని సగటున 5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువన అక్రమంగా కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతుంది. ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, వాటిని దెబ్బతీసే కర్ణాటక అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరించడం రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదా?’
‘ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. చివరి ఆయకట్టులోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన RDS ఫేస్ 2 ను పడావు పెట్టిన మీరు, ఇప్పుడు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆర్డీఎస్‌తో పాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.’
‘చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణ పేట, కొడంగల్ కు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా దాన్ని పక్కనబెట్టారు. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీసారు. 16.94 టీఎంసీల కేటాయింపులో సుమారు 7 టీఎంసీలను కొడంగల్ లిఫ్టుకు మళ్లించి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించే భీమా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఆర్డీఎస్ విషయంలో కర్ణాటకతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పాలమూరు రైతాంగానికి మరోసారి అన్యాయం చేస్తున్నారు’.
‘కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదు. తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది కేవలం ఒక ప్రాజెక్టు సమస్య కాదు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తుంగభద్ర జలాలను కర్ణాటక ఇష్టారాజ్యంగా వినియోగించకుండా బచావత్ ట్రిబ్యునల్ అనేక నిబంధనలను కృష్ణా అవార్డులో పొందుపరచింది. అయినప్పటికీ ఆ నిబంధనలు ఖాతరు చేయకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా బ్రిడ్జి కం బ్యారేజీలను, ఎత్తిపోతల పథకాలను నిర్మించడానికి పూనుకుంటున్నది. ఇంత ద్రోహం జరుగుతుంటే మీరు, మీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తెలంగాణా ప్రయోజనాలకు ద్రోహం తలపెట్టడం కాదా ?’
తెలంగాణ ప్రజల తరఫున, పాలమూరు రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్నికి కింద సూచించిన డిమాండ్లు చేస్తున్నాం.
1. తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలి.
2. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి.
3.అవసరం అయితే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు వేయాలి.
4. కమిషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలి.
‘సమైక్య పాలనలో కృష్ణా జలాల కేటాయింపులో, వినియోగంలో జరిగిన అన్యాయాలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన పాలమూరు ప్రజలు, తమ జల హక్కులను కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నాం. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం ప్రభుత్వ చట్టబద్దమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాలమూరు రైతాంగం భవిష్యత్తు కోసం, తెలంగాణ జల హక్కులను కాపాడటం కోసం బీఆర్ఎస్ నిర్విరామ పోరాటం చేస్తుంది. ఎంత దూరం దాకా అయినా వెళ్లి కొట్లాడుతుంది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పూర్తి కావొచ్చిన మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు.. త్వరలో నిందితులపై చర్యలు: మంత్రి అనగాని
ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
For More TG News And Telugu News