Share News

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..

ABN , Publish Date - Mar 31 , 2026 | 07:13 PM

హైదరాబాద్‌లోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..
Ex CM Jayalalitha

హైదరాబాద్, మార్చి 31: నగరంలోని శ్రీనగర్ కాలనీలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. మరో నెల రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను సెటిల్ చేసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులకు వారు హామీ ఇచ్చారు. దీంతో జయలలిత నివాసానికి వేసిన సీల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు.


2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో.. జీహెచ్ఎంసీ అధికారులు నగర వాసుల నుంచి పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న నివాసాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆ జాబితాలో శ్రీనగర్ కాలనీలో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన జీ ప్లస్ 4 భవనం సైతం ఉంది. ఈ భవనానికి 2016-17 నుంచి ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు.


జయలలితకు చెందిన నివాస భవనంపై రూ.1 కోటి 59 లక్షల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రూ.78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా, రూ.81 లక్షలు వడ్డీగా తేల్చారు. అందులో రాయితీ పోగా మొత్తం రూ.82,91,822 మేర బకాయి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జయలలితకు సంబంధించిన ఈ భవనంలో గతంలో ఓ ప్రైవేట్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లు జయలలిత కుటుంబ సభ్యులు నివాసమున్నారు. అయితే.. కొంత కాలంగా ఈ భవనం ఖాళీగా ఉంటున్నట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి లోకేశ్

రాజధానిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టండి.. పార్టీ శ్రేణులకు సీఎం పిలుపు

For More TG News And Telugu News

Updated Date - Mar 31 , 2026 | 09:10 PM