Share News

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Mar 31 , 2026 | 08:44 PM

వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామని.. అవసరం కోసం వచ్చే అవకాశవాదులు పార్టీలో కొనసాగుతారనే గ్యారంటీ లేదని ఆయన పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి లోకేశ్

అమరావతి, మార్చి 31: వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామని.. అవసరం కోసం వచ్చే అవకాశవాదులు పార్టీలో కొనసాగుతారనే గ్యారంటీ లేదని ఆయన పేర్కొన్నారు. కష్ట సమయంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకే ప్రాధాన్యం ఉండాలన్నారు. వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ.. నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

మంగళవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. అందుకనుగుణంగా శ్రేణుల్ని సిద్ధం చేయాల్సి ఉందన్నారు. యాక్టీవ్ కావాలంటూ జిల్లా పార్టీ అధ్యక్షులకు స్పష్టం చేశారు.


నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ కష్టపడే పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారికి మంత్రి లోకేశ్ సూచించారు. పార్టీనే సుప్రీమ్ అనేది ఎమ్మెల్యేలకు సైతం స్పష్టం కావాలన్నారు. రెవెన్యూ విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎంత మాత్రం ఉండకూడదని వివరించారు. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలు, పెట్టుబడిదారుల్ని బెదిరించే వ్యవహారాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని కుండబద్దలు కొట్టారు. పార్టీ బీ ఫామ్ ఇస్తేనే వాళ్లు మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలంటూ సమన్వయకర్తల సమావేశంలో వివరించారు.


ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పుడు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీరు పార్టీకి నష్టం చేసేలా ఉంటే ఉపేక్షించేందుకు అధినేత సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరని విద్యాశాఖ మంత్రి తెలిపారు. పెండింగ్ నామినేటెడ్ పదవులన్నీ ప్రాధాన్యత క్రమంలో త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉండాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సమన్వయకర్తలు భూమిరెడ్డి, బీదా రవిచంద్ర, సుజయ్ కృష్ణ రంగారావు, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, వేపాడ చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు.


వినే నాయకుడు ఉండటం మన అదృష్టం: మంత్రి లోకేశ్

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ ఇంచార్జ్‌లకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ఒక వ్యవస్థలా టీడీపీని తీర్చిదిద్దుదామన్నారు. వినే నాయకుడు చంద్రబాబు ఉండటం మన అదృష్టమని చెప్పారు. మీరంతా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులని అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రొడక్ట్ అని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాయకులను తయారు చేసే కార్ఖానా టీడీపీ అని తెలిపారు. యూనిట్, బూత్‌లను బలోపేతం చేయాలంటూ ఈ సందర్భంగా వారికి మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు.


తెలుగుదేశం పార్టీ నిరంతరం మారుతూ వచ్చిందని లోకేశ్ చెప్పారు. గ్రామ స్థాయి నాయకుడు బాగా పని చేస్తే వారిని గుర్తించి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టాల్సి ఉందన్నారు. రాబోయే పొలిట్ బ్యూరోలో మీరు ఆ మార్పును చూడబోతున్నారని క్లస్టర్ ఇంచార్జ్‌లకు స్పష్టం చేశారు. చంద్రబాబే మన అధినేత అని తెలిపారు. మనందరం కార్యకర్తలమని పేర్కొన్నారు. ఆయనే మన సేనాధిపతి అని.. మనం సైనికులమని.. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని వారికి మంత్రి లోకేశ్ సూచించారు. జగన్ రెడ్డి క్రెడిట్ చోరీ డిజార్డర్(సీసీడీ) వ్యాధితో బాధపడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు.


అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖలో డేటా సెంటర్, అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ, భోగాపురం విమానాశ్రయం, బల్క్ డ్రగ్ పార్క్ వంటి పరిశ్రమలు తానే తెచ్చానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్ జగన్ వైఖరిపై మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా ఎండగట్టారు. ఆ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైసీపీ అధినేతకు నారా లోకేశ్ సూచించారు.


వైసీపీ అహంకార ధోరణి వల్ల 151 సీట్లు 11 అయ్యాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఓర్పు, సహనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి బూత్‌కు వెళ్లడం ద్వారా 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ విజయం సాధించిందని మంత్రి లోకేశ్ వివరించారు.


పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు వంటిదని నారా లోకేశ్ ఈ సందర్భంగా చమత్కరించారు. అందుకే పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తున్నామని చెప్పారు. పార్టీ వల్లే మనకు ఈ గౌరవం లభిస్తోందన్నారు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబు కృషే కారణమని.. కలిసికట్టుగా పనిచేయాలంటూ శ్రేణులకు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తమిళనాడు దివంగత మాజీ సీఎం నివాసం సీజ్‌.. ఆపై తొలగింపు..

బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య

For More AP News And Telugu News

Updated Date - Mar 31 , 2026 | 09:05 PM