మున్సిపల్ కార్యాలయాల్లో తప్పని తిప్పలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 09:18 AM
విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.
సర్కిల్ కార్యాలయాల్లో మెరుగుపడని పరిస్థితులు
రెండున్నర నెలల క్రితం ఏర్పాటయినా ఇబ్బందులు
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణ
డిజిటల్ కీ మ్యాపింగ్ జరగలేదంటున్న సిబ్బంది
నాగారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ పారుడు గత ఏడాది అక్టోబరులో తన కొడుకు జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు. డిసెంబరులో మునిసిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనమైంది. ఇటీవల కొత్తగా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఏర్పడింది. ఇప్పటికీ దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది. ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయానికి వెళితే... ఇంకా డిజిటల్ కీ మ్యాపింగ్ జరగలేదు. సమయం పడుతుందని అక్కడే సిబ్బంది సమాధానం చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలోని ముషీరాబాద్ సర్కిల్ పరిధిలోని ఓ పౌరుడు నవంబరులో భవన నిర్మాణం ఆమోదం కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేశాడు. పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో సర్కిల్ మారిన దృష్ట్యా లాగిన్ కూడా మారింది. సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికీ దరఖాస్తుదారుడు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్‌లో ఆస్తి పన్ను సవరణ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేశాడు. మూడు నెలలుగా అధికారుల వద్దకు వెళ్తున్నా స్పష్టమైన సమాధానం రావడం లేదు. బదిలీలు జరిగాయి. కొత్త అధికారులు ఇంకా ఈ - ఆఫీస్‌లో ఫైళ్ల పరిశీలన ప్రారంభించలేదని చెబుతున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి19: విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 బోన్లుగా 3,153 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని మెగా కార్పొరేషన్‌ను పునర్ వ్యవస్థీకరించారు. నవంబరు 25వ తేదీన 27 మునిసిపాల్టీల విలీన ప్రతిపాదనను మంత్రివర్గం, జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదించగా.. గవర్నర్ ఆమోదంతో డిసెంబరు 3వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆదే రోజు 20 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని రికార్డులు జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సర్కిళ్ల వారీగా డీసీలతోపాటు ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం, హెల్త్ తదితర విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
కొందరికి మూడు చోట్ల బాధ్యతలు
ఉద్యోగులు, అధికారుల కొరతతో ఏఎంఓహెచ్‌లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మెజార్టీ అధికారులకు రెండు సర్కిళ్లు, కొందరికి మూడు చోట్ల బాధ్యతలు కేటాయించారు. దీంతో వారు పూర్తిస్థాయిలో ఎక్కడా అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియగా, 11వ తేదీన జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల ఏర్పాటును ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.
డిసెంబరు మొదటి వారంలోనే వార్డులు, సర్కిళ్లు జోన్లపై స్పష్టత వచ్చింది. పాలనాపరమైన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా ఇప్పటికీ పౌర సేవల్లో మెరుగుదల కనిపించడం లేదు. కొన్ని కార్యాలయాల్లో సమాధానం చెప్పే వారూ కరువయ్యారు. సరిపడా అధికారులు, ఉద్యోగులు లేకపోవడం పౌర సేవల్లో జాప్యానికి మరో కారణం.
ఫర్నిచర్.. వసతులు లేక..
సర్కిళ్ల సంఖ్య పెరగడంతో పూర్వ జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వార్డు, కమ్యూనిటీ హాళ్లలో సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కొన్ని సర్కిల్ కార్యాలయాలను జోనల్ ఆఫీస్‌లుగా మార్చారు. ఇప్పటికీ పలు కార్యాలయాల్లో ఫర్నిచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరుగుదొడ్లు, తాగునీటి వంటి వసతులూ లేవు. కొన్ని సర్కిల్ కార్యాలయాల వద్ద అధికారులు, ఉద్యోగుల వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. ప్రజలు దూర ప్రాంతాల్లో వాహనాలు నిలపాల్సి వస్తోంది. కొన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఇంటర్నెట్, పూర్తిస్థాయిలో కంప్యూటర్లూ అందుబాటులో లేవు. ట్రై కార్పొరేషన్లలో కొత్తగా ఏర్పడిన సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
సర్కిల్ కార్యాలయాలు రెండు చోట్ల
పలు ప్రాంతాల్లో సర్కిల్ కార్యాలయాలు రెండుచోట్ల కొసాగుతున్నాయి. భవనాలు ఇరుకుగా ఉండడం.. అన్ని విభాగాలకు సరిపడా స్థలం అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వస్తోన్న ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. సర్కిల్ కార్యాలయం చిరునామా ఎక్కడని చెప్పాలో అర్ధం కావడం లేదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బోడుప్పల్ సర్కిల్ సర్కిల్ కార్యాలయం పూర్వ కార్పొరేషన్ భవనంతోపాటు, పీర్జాదిగూడ కార్పొరేషన్ భవనంలో కొనసాగుతోంది. ఆదిభట్ల సర్కిల్ కార్యాలయం రాగన్న గూడ, తుర్కయాంజల్ వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. పెద్దఅంబర్‌పేట మునిసిపాలిటీ భవనంలో నాగోల్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. పక్కపక్కనే రెండు భవనాలు ఉన్నప్పటికీ అన్ని సెక్షన్లకు సరిపడా స్థలం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు కూర్చునేందుకు స్థలం లేదు.
సిద్ధమవుతున్న ప్రధాన కార్యాలయాలు
తార్నాకలోని హెచ్ఎండీఏ భవనంలో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. కమిషనర్ కూర్చునే చోట రంగులు, ఫర్నిచర్, పార్టిషన్ వంటివి పూర్తయ్యాయి. వారం క్రితం కార్పొరేషన్ల విభజన జరిగిన దృష్ట్యా ఇప్పుడిప్పుడే ఇతర విభాగాలకు అవసరమైన ఫర్నిచర్, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న భవనాన్ని శుభ్రం చేస్తున్నారు. తాత్కాలికంగా అదనపు కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ ఇంజనీర్ల ఛాంబర్లు సిద్ధం చేశారు. ఆయా విభాగాల సిబ్బంది కోసం కుర్చీలు, కంప్యూటర్లు సమకూరుస్తున్నారు.
అంతకుముందు ఉన్న ఫర్నిచర్‌కూ మరమ్మతు జరుగుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కమిషనర్ ఛాంబర్, పేషీకి సంబంధించిన ఆధునికీకరణ పనులు పూర్తి కాగా.. సృజన అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర విభాగాలు ప్రస్తుతం మణికొండలోని మునిసిపాలిటీ భవనంలో కొనసాగుతున్నాయి.
ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేసి అదనపు కమిషనర్లతోపాటు అన్ని విభాగాలను న్యాక్ భవనంలోకి తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లోయర్ ట్యాంక్ బండ్ కొనసాగుతోంది. ఈ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు సంబంధించిన ఆఫీస్ ఏర్పాటులో ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
For More TG News And Telugu News