గణపయ్య చెంత.. కమ్మని వంట!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:13 AM
ఒక్క మారేడు దళాన్ని సమర్పించినంతనే ఆ హరుడు మూడు జన్మల నాటి పాపాలను హరిస్తాడంటారు. శివపుత్రుడైన గణపతీ అంతే! ఓం గణేశాయ నమః అంటూ కాసిన్ని పచ్చని గరిక పోచలను సమర్పించినంతనే తొండమెత్తి దీవించేస్తాడు!
బ్యాచిలర్లు, హాస్టల్ విద్యార్థులకు వరంగా మండపాల వద్ద నిత్యాన్న ప్రసాదాలు
9 రోజులూ వేర్వేరు మెనూతో వంటకాలు
దర్శనానికి దర్శనం.. రుచికరమైన భోజనమూ
ఎక్కడ? ఏం వండుతున్నారనేదానిపై ప్రత్యేక వెబ్‌సైట్లు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఒక్క మారేడు దళాన్ని సమర్పించినంతనే ఆ హరుడు మూడు జన్మల నాటి పాపాలను హరిస్తాడంటారు. శివపుత్రుడైన గణపతీ అంతే! ఓం గణేశాయ నమః అంటూ కాసిన్ని పచ్చని గరిక పోచలను సమర్పించినంతనే తొండమెత్తి దీవించేస్తాడు! అంతేనా.. లంబోదరుడనే పేరుకు తగ్గట్టు గజాననుడు భోజనప్రియుడు కూడా నూ! కుడుములు, మోదకాలు, లడ్డూలు, బెల్లంతో చేసిన చలిమిడి వగైరాలు సుష్ఠుగా తిని భుక్తాయసంతో మూషికవాహనుడు నడవలేక నడవలేక నెమ్మదిగా అడుగులు వేస్తుంటేనే కదా పై నుంచి చూసి చంద్రుడు కిసుక్కున నవ్వింది! అదివేరే కథనుకోండి! బొజ్జ గణపయ్యకు ఉన్న ఈ భోజన ప్రియత్వాన్ని గణేశ నవరాత్రుల సందర్భంగా ‘ఏక్ నిరంజన్’లు పాటించి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటున్నారు. భాగ్యనగరం అచ్చంగా ఇప్పుడు గల్లీకా గణేశ్! ఎక్కడ చూసినా వినాయక మండపాలే! అక్కడ ఏకదంతుడికి అనేక నైవేద్యాలు! రకరకాల వంటకాలను నిర్వాహకులు వండివార్చుతున్నారు. వాటిని అన్న ప్రసాదంగా భక్తులు తృప్తిగా ఆరగిస్తున్నారు. ముఖ్యంగా వంటలు చేసుకొని చేతులు కాల్చుకునే బ్యాచిలర్ జీవులకు గణేశ నవరాత్రులు షడ్రసోపేతమైన విందునిస్తున్నాయి.
కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, వలస కార్మికులు, మరీ ముఖ్యంగా హాస్టల్ భోజనం తినీ తినీ నాలుక చప్పబడిపోయిన యువతీయువకులు జిహ్వచాపల్యాన్ని తీర్చుకునేందుకు గణేశ్ మండపాలకు వెళుతున్నారు. ఒకరోజు ఓ మండపం వద్ద ఘుమఘుమలాడే ఆవపెట్టిన పులిహోర, మరుసటి రోజు కమ్మని దద్దోజనం.. ఇంకోరోజు పలు కూరగాయాలతో వండిన నోరూరించే బిర్యానీ, రకరకాల స్వీట్లు ఇలా రుచులను బహుదా ఆస్వాదిస్తున్నారు. అందునా.. ఎక్కడ.. ఏ సమయంలో ఏ మండపం వద్ద ఏమేం పెడుతున్నారు? అనేది తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రత్యేక వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రావడం వారికి మరింత రుచికరంగా మారింది. కొన్నిచోట్లయితే అన్న ప్రసాదాల తాలూకు వివరాలను మ్యాప్ లొకేషన్ల సహా ఇస్తున్నారు. ఫలితంగా ఎక్కడికి వెళితే నచ్చిన వంటకం దొరుకుతుందో ముందే తెలిసిపోతుండటంతో నేరుగా అక్కడికే వెళ్లి గణేశుడిని దర్శించుకొని.. అన్న ప్రసాదాన్ని తృప్తిగా స్వీకరిస్తున్నారు.
మండపాల వద్దకు వెళితే ఉచితంగా భోజనం దొరుకుతుంది అని కాకుండా అందరితో కలిసి సరదాగా భోజనం చేస్తే ఆ తృప్తే వేరు అన్న భావన భక్తుల్లో కనిపిస్తోంది. తరతమ భేదాలు లేవు.. ఓ ఐటీ ఉద్యోగి పక్కనే ఓ ఆటో డ్రైవర్.. ఓ బడా వ్యాపారి పక్కన ఓ నిరుపేద కార్మికుడు, ఓ ప్రజాప్రతినిధి పక్కన ఓ విద్యార్థి కూర్చొని భోజనం చేయడం కనిపిస్తోంది. మండపాల వద్ద వలంటీర్లు తమ సేవలద్వారా ‘అతిథి దేవోభవ’ అనే ఆర్యోక్తికి సార్థకత చేకూరుస్తున్నారు. కొన్ని మండపాల వద్ద నవరాత్రుల సందర్భంగా ఏదో ఒకరోజే అన్న ప్రసాదం పెడుతుంటే ఇంకొన్ని మండపాల్లో తొమ్మిది రోజులూ వేర్వేరు మెనూలతో భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో మండపం వద్ద అన్న ప్రసాదం కోసమే ఇరవై వేల నుంచి యాభై వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులను స్థానిక వ్యాపారులు, కాలనీవాసులు, భక్తులు తమ వంతుగా విరాళాలుగా సమకూర్చుతున్నారు. మండపాల వద్ద నిర్వాహకులు క్యూఆర్ కోడ్ బోర్డులు పెడుతుండటంతో కొందరు తోచినంత ఇస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
చంచల్‌గూడ జైలుకు ‘బిలియనీర్లు’!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News