చంచల్‌గూడ జైలుకు ‘బిలియనీర్లు’!
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:06 AM
ప్రభుత్వ ఉద్యోగం.. చేతిలో అధికారం.. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత. కానీ, కొందరు అధికారులు అదే అధికారాన్ని అవినీతికి ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగ బాధ్యతగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేసి..
జైలుకు క్యూ కడుతున్న అవినీతి కేసుల ఖైదీలు..
లంచం, అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కుతున్న అధికారులు
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం.. చేతిలో అధికారం.. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత. కానీ, కొందరు అధికారులు అదే అధికారాన్ని అవినీతికి ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగ బాధ్యతగా చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేసి.. బాధితుల నుంచి ఆ నగదును తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారు. మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టి.. అక్రమ సంపాదనకు సంబంధించిన కేసుల్లో అరెస్టవుతున్నారు. ఆ తర్వాత న్యాయస్థానం రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు చేరుతున్నారు. అవినీతి కేసుల్లో ఇలా రిమాండ్ ఖైదీలుగా ఈ జైలుకు చేరుతున్న వారిలో పలువురు రూ.వంద కోట్లకు పైగా ఆస్తులున్నవారు ఉంటున్నారు. దీంతో చంచల్‌గూడ జైలు మిలియనీర్ల జైలుగా మారిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ రూ.వంద కోట్ల దాకా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొద్దిరోజుల క్రితం పోలీసు శాఖలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. వంద కోట్లకుపైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతకుముందు ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. ఆయన ఇంటితోపాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి రూ.100 కోట్లకు పైగా అక్రమార్జనకు సంబంధించిన ఆస్తుల వివరాలు గుర్తించింది. ఇలా ఏసీబీకి పట్టుబడుతున్నవారు చాలావరకు హైదరాబాద్, శివారు ప్రాంతాలకు చెందినవారే ఉంటుండడంతో.. వారందరినీ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. అవినీతి కేసుల్లో ప్రధానంగా రెండు రకాల ఘటనలు కనిపిస్తున్నాయి.
ఒకటి.. పనిచేసి పెట్టేందుకు లేదా కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు నేరుగా లంచం డిమాండ్ చేయడం. రెండోది.. అధికారిగా ఉన్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేయడం. ఈ రెండు రకాల కేసుల్లోనూ ఆధారాలు సేకరించిన అనంతరం అరెస్టులు, కోర్టు రిమాండ్ తదితర ప్రక్రియ కొనసాగుతోంది. కోర్టు రిమాండ్ విధించినప్పుడు చంచల్‌గూడ జైలు.. నిందితుల తాత్కాలిక నిలయంగా మారుతోంది. పోలీసు శాఖ నుంచి రెవెన్యూ, ఇంజనీరింగ్, వైద్య, మున్సిపల్ ఇతర ప్రభుత్వ విభాగాల వరకు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ఏసీబీ కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఇదే జైలుకు చేరుతున్నారు. అప్పటివరకు అధికారం, విలాసవంతమైన జీవనం గడిపినవారు.. జైల్లో విచారణ ఖైదీలుగా కాలం వెల్లదీస్తున్నారు. కాగా లంచం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రాథమిక విచారణ అనంతరం ఏసీబీ అధికారులు.. నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల్ని జైలుకు తరలిస్తారు. కోర్టు రిమాండ్ తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమైతే జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడ్ని కోర్టు అనుమతితో ఏసీబీ కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తుంది.
అధికారిగా పనిచేసిన జైల్లోనే ఖైదీగా!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్‌జైలులో దేవేందర్ అనే అధికారి.. డిప్యూటీ జైలర్ హోదాలో బాధ్యతలు నిర్వహించేవారు. ఓ రిమాండ్ ఖైదీకి జైల్లో మెరుగైన సదుపాయాలు, ములాఖత్‌ల విషయంలో మేలు చేసేందుకు అతని సమీప బంధువు నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. మధ్యవర్తి సహాయంతో లంచం డబ్బులు తీసుకుని ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అప్పటివరకు ఆ జైలులో అధికారిగా ఉన్న దేవేందర్.. గంటల వ్యవధిలోనే అదే జైల్లో ఖైదీగా మారాల్సి వచ్చింది. కాగా, కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిపై ఇటీవల లంచం కేసు నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇరువురి వద్ద కలిపి రూ.15.5 లక్షల నగదు, 27.5 తులాల బంగారు ఆభరణాలు, భూములు, ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎస్‌ఐకి సంబంధించిన 5.05 ఎకరాల భూమి, రూ.31 లక్షల విలువైన నాలుగు ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ కేసుల్లో చంచల్‌గూడకు చేరిన కొందరు..
సంకిరెడ్డి భీమ్‌రెడ్డి (డీఎస్పీ)
నాయిని భుజంగరావు (ఏఎస్పీ)
సుంకరి నరహరిరావు
(సర్వే-ల్యాండ్ రికార్డ్స్ డీడీ)
సగ్గం అనంత లక్ష్మీకుమార్
(జలమండలి జీఎం)
ముత్యం వెంకట రమణ (రెడ్కో డీఈ)
గోవర్ధన్ (వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్)
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
నేడు, రేపు భారీ వర్షాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News