Share News

సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం.. డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:05 PM

షార్ట్‌ ఫిలిమ్స్‌, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పలువురు బాధితులు అంబర్‌పేట్ శివంరోడ్డు‌లోని డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు.

సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం.. డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా

హైదరాబాద్, సెప్టెంబర్ 12: షార్ట్‌ ఫిలిమ్స్‌, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ పలువురు బాధితులు అంబర్‌పేట్ శివంరోడ్డు‌లోని డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


బాధితుల కథనం ప్రకారం.. డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్, అతని అనుచరులు శ్రీరామ్, లావణ్యలు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని నమ్మబలికి పలువురి నుంచి రూ.20 లక్షల చొప్పున వసూలు చేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని పలువురి నుంచి కోట్ల రూపాయల వసూలుకు పాల్పడ్డారు. సినిమా అవకాశాల కోసం ఎప్పుడు అడిగినా.. రేపు, మాపు అంటూ ముఖం చాటేస్తున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు.


భారీగా మోహరించిన పోలీసులు

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు భారీ బందోబస్త్‌ను మోహరించారు. పోలీసులు, బాధితులకు మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ శివను బయటకు పిలిపించి తమతో మాట్లాడించాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేదాకా అక్కడ నుంచి కదలమని బాధితులు స్పష్టంచేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్‌పై పలు కేసులున్నాయి

సినిమాల్లో అవకాశాల పేరుతో శివ చాలామందిని మోసం చేశారని, ఇప్పటికే అతనిపై పలు కేసులున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 25 మంది మహిళలను సినిమాల్లో అవకాశాల పేరుతో నమ్మించి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు‌కు హీరోయిన్ అవకాశాన్ని ఇప్పిస్తానని చెప్పి రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ రోదిస్తున్న ఓ బాధితురాలు.. సొమ్మసిల్లి కింద పడిపోయారు. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బంగారం ధర

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 12:47 PM