నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:18 AM
వినాయక నిమజ్జన ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పి ఓ కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న దంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు
వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
దంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
రంగారెడ్డి జిల్లా పాల్మాకుల వద్ద ఘటన
శంషాబాద్ రూరల్, నవాబ్‌పేట, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జన ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పి ఓ కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న దంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకుల వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మం డలం మెట్టుగడ్డతండాకు చెందిన కేతావత్ లింబ్యా నాయక్ (54), కేతావత్ జమున(45), కాట్రవత్ మాన్‌సింగ్ (48), కేతావత్ వస్రాం(45) మరణించారు.
మెట్టుగడ్డ తండాకు చెందిన లింబ్యా నాయక్, జమున దంపతులతోపాటు మాన్‌సింగ్, వస్రాం వ్యాపారం నిమిత్తం వచ్చి శంషాబాద్‌లో స్థిరపడ్డారు. వీరంతా డ్రైవర్ సబావత్ అశోక్‌తో కలిసి ఓ ఇన్నోవా కారులో శుక్రవారం తండాకు వెళ్లారు. అక్కడ వినాయక నిమజ్జన ఉత్సవాల్లో గ్రామస్థులతో కలిసి సంతోషంగా గడిపారు. అనంతరం అర్ధరాత్రి తిరిగి శంషాబాద్ బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో హైదరాబాద్-బెంగుళూర్ జాతీయ రహదారిలో పాల్మాకుల పెట్రోల్ పంప్ సమీపంలో తెల్లవారుజామున కారు అదుపు తప్పి అతివేగంతో ఓ కల్వర్టును బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ అశోక్ నిద్రమత్తు వల్ల వాహనం మీద నియంత్రణ కోల్పోయినట్టు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న లింబ్యా నాయక్, జమున, మాన్‌సింగ్, వస్రాం అక్కడికక్కడే మరణించారు. పోలీసులు 4 గంటలు శ్రమించి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అశోక్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన లింబ్యా, జమున దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ అమెరికాలో ఉన్నారని తెలిసింది. మాన్‌సింగ్, వస్రాంల భార్యలు జమునకు సొంత చెల్లెళ్లు.
ఈ వార్తలు కూడా చదవండి:
పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే..
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News