Share News

మాజీ డీజీపీ మృతి.. సంతాపం తెలిపిన సీఎం

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:40 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మాజీ డీజీపీ మృతి.. సంతాపం తెలిపిన సీఎం

హైదరాబాద్, మార్చి 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్. జె. దొర మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో బాత్‌రూమ్‌లో ఆయన పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతోపాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో హెచ్.‌జె.దొర ఎంతో కృషి చేశారని తెలిపారు. దొర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం రేవంత్ తెలియజేశారు.


1965 ఐపీఎస్ బ్యాచ్ అధికారి హెచ్.జె.దొర.1996 నుంచి 2002 వరకు ఉమ్మడి ఏపీ డీజీపీగా దొర విధులు నిర్వహించారు. ఈ సమయంలో ఉమ్మడి ఏపీలో నక్సలైట్లను అణిచి వేయడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే సీఐఎస్ఎఫ్ డీజీగా, విజిలెన్స్ కమిషనర్‌గా సైతం దొర పని చేశారు.


1943లో శ్రీకాకుళంలో హెచ్.జె.దొర జన్మించారు. తన సుదీర్ఘ జీవితకాలంలో దాదాపు 40 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో వివిధ హోదాల్లో ఆయన సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదట అడిషనల్ డీజీపీగా అనంతరం డీజీపీగా దొర బాధ్యతలు చేపట్టారు. 2002లో డిప్యూటేషన్‌పై దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఐఎస్ఎఫ్ డీజీగా పని చేశారు. పోలీసు శాఖతోపాటు క్రీడారంగంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు.


ఇండియన్ ఒలంపిక్స్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 1993లో పీపుల్స్ వార్ గ్రూపు లక్ష్యంగా చేసుకున్న 40 మంది పోలీసు అధికారుల జాబితాలో హెచ్.జె.దొర పేరు కూడా ఉంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పోలీస్ మెడల్ అందుకున్నారు. హెచ్.జె.దొర మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, పోలీస్ సంక్షేమ సంఘం సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిలో బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌: సంస్థ ప్రతినిధులు

ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు

For More AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 05:45 PM