ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:41 PM
భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన కీలక సూచనలతోపాటు దిశానిర్దేశం చేశారు.
భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకు రైతులను ముందస్తుగా సమాయత్తం చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. వెలుగొండ ఫేజ్-1 ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. కృష్ణా నది కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్ట పరచాలని ఆదేశించారు.
మార్చి 16వ తేదీన అన్ని జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతున్న వేళ.. ప్రజలు ఇబ్బంది పడకుండా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఉంటారన్నారు.
గ్యాస్ లేని పక్షంలో ఇండక్షన్ స్టవ్‌లు కొంటున్నారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. వివిధ శాఖల్లో మంత్రులు, ఉన్నతాధికారులపై కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఏప్రిల్ 2వ తేదీన ఇస్తానని సీఎం చెప్పుకొచ్చారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 ఏడాదిలో పని తీరు మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నివేదికలో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధులు వినియోగం, పథకాల అమలు వంటి అంశాలు రహస్య నివేదికలో ఉంటాయని ఆయన వివరించారు.
పంచాయతీలు మాదిరిగా జలవనరుల శాఖ కూడా నీటి పన్ను వసూలు చేయాలని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సీఎం సూచించారు. మీరు చేసిన పనిని.. మీడియాకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వాన్ని స్థిరత్వానికి తీసుకువచ్చామని, ఇక ఇప్పుడు టేక్ ఆఫ్ చేయాలని తెలిపారు. అందరూ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని.. అప్పుడు మాత్రమే శాఖల్లో లక్ష్యాన్ని చేరుకుంటారని మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం
మూసీ ప్రాజెక్ట్‌కు బీజేపీ వ్యతిరేకం కాదు: టీ బీజేపీ చీఫ్
For More AP News And Telugu News