Share News

మూసీ ప్రాజెక్ట్‌కు బీజేపీ వ్యతిరేకం కాదు: టీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:10 PM

మూసీ ప్రాజెక్ట్‌పై బీజేపీకి వ్యతిరేకత లేదని.. కాని పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాంచందర్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడారు.

మూసీ ప్రాజెక్ట్‌కు బీజేపీ వ్యతిరేకం కాదు: టీ బీజేపీ చీఫ్
T BJP Chief N Ramachandra Rao

హైదరాబాద్, మార్చి13: మూసీ ప్రాజెక్ట్‌పై బీజేపీకి వ్యతిరేకత లేదని.. కాని పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాంచందర్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడారు. మూసీపై పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మూసీ నది పునరుజ్జీవనానికి కానీ.. మూసీ ప్రాజెక్ట్‌ను కానీ బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు.

మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని.., అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని.. ఆ నీరు రైతులకు సాగునీటి కోసం ఉపయోగపడాలని తమ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ.. బీజేపీపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కానీ మూసీ విషయంలో బీజేపీ వైఖరి మొదటి నుంచీ ఒకటేనని గుర్తు చేశారు.


మూసీ నది తప్పకుండా పునరుజ్జీవనం కావాలని తమ పార్టీ ఇప్పటికీ చెబుతుందన్నారు. కానీ ‘గాంధీ సరోవర్’ పేరుతో అక్కడ నివసిస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం అంగీకారయోగ్యం కాదన్నారన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ ఇళ్లను కూల్చకుండానే మూసీని శుద్ధి చేయవచ్చునన్నారు.


సబర్మతి నదిని ఉదాహరణగా తీసుకునే వారు.. ముందుగా అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా ఏర్పాటు చేశారో తెలుసుకోవాలంటూ కీలక సూచన చేశారు. ఒకప్పుడు సబర్మతి సైతం మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి, నదుల అనుసంధానం చేయడం ద్వారా ఆ నదిని శుభ్రపరిచారని చెప్పారు. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలను ముందుగా పునరావాసం కల్పించి.. ప్రత్యామ్నాయ గృహాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టారని గుర్తు చేశారు. సుమారు 4 వేల కుటుంబాలకు ప్రత్యామ్నాయ గృహాలు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజల జీవితం దెబ్బతినకుండా జరిగేదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను నిరాశ్రయులను చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చడం అన్యాయమన్నారు.


గాంధీ సరోవర్ కోసం భూమి అవసరమైతే ప్రాజెక్టును రియలైన్ చేసుకోవచ్చని సూచించారు. ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, దానికి బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ పేదల ఇళ్లు కూల్చి వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తే మాత్రం బీజేపీ తప్పకుండా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. ముందుగా మూసీని శుద్ధిచేసి, ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపట్టాలని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు.


రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ఉన్నప్పుడు వాటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంపైనా కనిపించవచ్చని, కానీ అదే పేరుతో దేశంలో కొరత వస్తుందని భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, ప్రధాని నరేంద్ర మోదీ.. సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి, భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. భారతదేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచీ వస్తోందని చెప్పారు. అందువల్ల దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండదన్నారు.


యుద్ధ పరిస్థితుల వల్ల రవాణాలో స్వల్ప ఆలస్యాలు ఉండొచ్చని.. కానీ ఇంధన కొరత మాత్రం ఉండదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా భారత ప్రజలు వాటిని ఎదుర్కొనే శక్తి కలిగిన వారని చెప్పారు. అలాంటి సమయంలో నాయకులు.. ప్రజల్లో ధైర్యం నింపాల్సిందే తప్ప, భయాందోళనలు కలిగించడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు. దేశంలో గృహ వినియోగ ఎల్‌పీజీ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. సాధారణ ప్రజలకు ఇంధన సరఫరా నిరంతరం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం సైతం హామీ ఇచ్చిందన్నారు. అందువల్ల వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ రాంచందర్ రావు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 03:15 PM