Share News

దేశంలోనే అది మెుదటి ఏఐ క్యాంపస్: బిట్స్ బిలానీ ప్రతినిధులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:18 PM

రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఉండబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

దేశంలోనే అది మెుదటి ఏఐ క్యాంపస్: బిట్స్ బిలానీ ప్రతినిధులు
AP Minister Nara Lokesh

అమరావతి, మార్చి 13: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఉండబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు సైతం ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేశ్‌కు వారు వివరించారు. శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో ఆయనతో బిట్స్ పిలానీ ప్రతినిధులు సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా బిట్స్ చేపట్టిన నిర్మాణ ప్లాన్లను లోకేశ్ పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని వారిని మంత్రి లోకేశ్ కోరారు. బిట్స్ పిలానీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.


రెండు దశల్లో 7 వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. ఈ క్యాంపస్‌పై వచ్చే ఐదేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి పెడతామని వారు ఈ సందర్భంగా వివరించారు. అలాగే సీఎం చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.


ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నామని తెలిపారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్. చెన్నవీర్, బీఎస్ సహాని తదితరులు మంత్రి లోకేశ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


అనంతరం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణతో బిట్స్ పిలానీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి క్యాంపస్‌లో నిర్మించే భవనాల డిజైన్లను మంత్రి నారాయణకు వారు వివరించారు. రెండున్నరేళ్లలో మొదటి దశ అడ్మిషన్లకు సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా మంత్రికి బిట్స్ ప్రతినిధులు తెలిపారు. మందడం, వెంకటపాలెం మధ్య సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన 70 ఎకరాల్లో బిట్స్ క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మూడు దశల్లో AI+ క్యాంపస్‌గా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్మాణం చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మూసీ ప్రాజెక్ట్‌కు బీజేపీ వ్యతిరేకం కాదు: టీ బీజేపీ చీఫ్

ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు

For More AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 05:24 PM