బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:21 PM
బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారను అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. నేటీకి బీఆర్ఎస్ నుంచి తనను కేసీఆర్ మెడ పట్టి బయటకు గెంటేసి ఐదేళ్లు అవుతోందన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 05: బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారను అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. నేటీకి బీఆర్ఎస్ నుంచి తనను కేసీఆర్ మెడ పట్టి బయటకు గెంటేసి ఐదేళ్లు అవుతోందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు నచ్చకనే.. తాను బయటకు వచ్చానన్నారు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి లాంటి నేతలు సైతం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు.
ఏ పార్టీలో అయినా పోటీ ఉంటుందని ఎంపీ ఈటల అన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. ఏదో ఆశించి పార్టీ మారినట్లు కొంత మంది తనపై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ తప్పు అని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని.. ఈ సందర్భంగా ఈటల గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర నీలాంటి పోటెన్షియల్ ఉన్న లీడర్ తమ పార్టీలోకి రావాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు.
పార్టీ మారే విధానంలో తాను చేసింది కరెక్ట్ అనుకోవడం లేదని ఎంపీ ఈటల అభిప్రాయపడ్డారు. కానీ అప్పటి పరిస్థితుల్లో పార్టీ మారక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. తాను నిత్యం సోషల్ మీడియాలో ఉండే వ్యక్తిని కాదని.. ప్రజలతో ఉండే మనిషినని చెప్పారు. పార్టీ నుంచి బయటకు పంపే క్రమంలో తనను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారని.. వాటిని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు. ఆనాడు కేసీఆర్ చేసిన నియంత పోకడలన్నీ సమాజానికి తెలిశాయన్నారు. మొత్తం వ్యవస్థను చేతిలో పెట్టుకొని తనను అత్యంత దారుణంగా అవమానించారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ తాను అదే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాననే ప్రచారం సాగుతోందని మండిపడ్డారు.
కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా జీవన్ రెడ్డి, తాను, బొడిగె శోభా తదితరులు టీఆర్ఎస్‌లోకి వెళ్లారనే పిచ్చి ప్రచారం సాగుతోందని ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇరవై ఏళ్ళ పాటు బీఆర్ఎస్‌లో ఉన్నానని, దీంతో సహజంగానే ఆ పార్టీలోని నేతలతో తనకు పరిచయాలు ఉంటాయని పేర్కొన్నారు. తన క్యారెక్టర్ మొత్తం ప్రజల వద్ద కించపరిచే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తనను అభిమానించే చాలా మంది ఈటెల రాజేందర్ లాంటి లీడర్ బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళితే బాగుంటుందనే ఒక చర్చ సైతం సాగుతోందన్నారు.
ఇలా అని తాను అనడం లేదని.. కేవలం చర్చ మాత్రమేనని ఈ సందర్భంగా రాజేంద్ర క్లారిటీ ఇచ్చారు. ఈ చర్చను ఆపాల్సిన అవసరం, బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు మినహాయిస్తే మిగిలిన ఆరుగురు ఎంపీలు ఇకపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా పని చేస్తామని ఈటల పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేసవికాలం.. తాపాన్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..
100 ఎకరాల్లో అత్యాధునిక ఆర్టీసీ బస్ టెర్మినల్
For More AP News And Telugu News