ఆర్ అండ్ బీ మాజీ సీఈ మోహన్ నాయక్‌పై ఈడీ నజర్
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:14 AM
ఆదాయానికి మించి కూడబెట్టిన ఆర్ అండ్ బీ మాజీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
గత జూన్‌లో ఏసీబీ కేసు నమోదు
ఏసీబీ కేసు ఆధారంగా త్వరలో ఆయనకు నోటీసులు
మోహన్ నాయక్ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి కూడబెట్టిన ఆర్ అండ్ బీ మాజీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై గత జూన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మోహన్ నాయక్‌ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అరెస్టు చేసింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగానే రంగంలోకి దిగిన ఈడీ.. త్వరలో ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించనున్నది. ఆయనకు రూ.17.94 కోట్ల విలువైన ఆస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు.. మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ సుమారు రూ.200 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు.
ఇప్పటి వరకూ ఏసీబీ నమోదు చేసిన ‘ఆదాయానికి మించిన ఆస్తుల’ కేసుల్లో అత్యధిక ఆస్తులున్న అధికారుల్లో ఆయనది రెండోస్థానం. గత జూన్‌లో మోహన్ నాయక్ నివాసంతోపాటు మొత్తం 15 చోట్ల ఏకకాలంలో జరిపిన సోదాల్లో నిజామాబాద్ జిల్లాలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని కొంపల్లి, గచ్చిబౌలిలలో ఏడు ప్లాట్లు, మియాపూర్‌లో రూ.2.5 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఇల్లున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు రూ.కోటి అడ్వాన్సుగా చెల్లించినట్లు కనుగొన్న ఏసీబీ అధికారులు.. తమ సోదాల్లో రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల విలువైన డిపాజిట్ల పత్రాలతోపాటు రూ.కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, విలువైన ఇతర వస్తువులను జప్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News