డిండి ఎత్తిపోతలను రద్దు చేయాలి : డీకే అరుణ
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:41 AM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సంబంధం లేని డిండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సంబంధం లేని డిండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి పైపులైన్ల ద్వారా డిండికి నీళ్లు తరలించడమంటే పాలమూరు రైతాంగం గొంతు నులమడమేనని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకపోగా, అందుబాటులో ఉండే నీటిని డిండికి కేటాయించడమంటే ఆ జిల్లాకు అన్యాయం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పాలమూరు జిల్లాకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ ప్రజలకు పుట్టంగండి లేదా నక్కలగండి నుంచి నీరు తీసుకుంటే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పాలమూరు రైతుల గొంతు నులిమేలా నాడు మాజీ సీఎం కేసీఆర్ ఉరితాడు వేస్తే ఇప్పుడు రేవంత్ ఆ ఉరితాడు ఉచ్చుబిగిస్తున్నారని ఆమె ఆరోపించారు. డిండితో సీఎం రేవంత్ పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచే నీళ్లు తీసుకునేలా డీపీఆర్‌ను సమీక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News