Share News

దక్షిణాదికి నష్టం.. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:59 AM

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీరని నష్టమని, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి అన్నారు.

దక్షిణాదికి నష్టం.. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం

  • డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా దళిత, గిరిజన ఎంపీలు ఓటేయాలి: మల్లు రవి

  • రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర: బలరాం నాయక్‌

  • ఆర్‌ఎస్ఎస్‌కు బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌: వంశీకృష్ణ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీరని నష్టమని, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా దళిత, గిరిజన ఎంపీలందరూ డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు బలరాం నాయక్‌, గడ్డం వంశీకృష్ణలతో కలిసి మల్లు రవి మాట్లాడారు. బీజేపీ దళిత, గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఆ వర్గాలను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. బిల్లుకు మద్దతు కూడగట్టేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీల్లో బీజేపీ చీలిక తెచ్చిందని, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీల విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించిందని ఆరోపించారు.


ఈ పరిణామాల వెనుక ఉద్దేశం ప్రజలకు తెలుసన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెట్టారో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌ వెనుక రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసే కుట్ర దాగి ఉందని ఎంపీ బలరాం నాయక్‌ ఆరోపించారు. పది రోజుల పాటు పార్లమెంట్‌లో చర్చించిన తర్వాతే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అంటేనే ఆర్‌ఎస్ఎస్‌కు బీ టీమ్‌ అని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు.


డీలిమిటేషన్‌తో తెలంగాణ అన్యాయం జరుగుతుందని తెలిసినా బీఆర్‌ఎస్‌ ఎందుకు మద్దతు ఇస్తోందో ‘కేటీఆర్‌ అంకుల్‌’ చెప్పాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ప్రతిపాదిత డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీకి బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తే అది 2051 వరకు అమలులో ఉంటుందని, తద్వారా మరో 25 ఏళ్ల పాటు బీసీలు రాజకీయ ప్రాతినిధ్యానికి దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి ఓ లేఖ రాశారు.


దీక్షా దివస్‌ పేరుతో కేటీఆర్‌ కట్టుకథలు: ఆది శ్రీనివాస్‌, అద్దంకి

దీక్షా దివస్‌ పేరుతో కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. అబద్ధాల కథను అల్లుతున్నారని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అద్దంకి దయాకర్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నట్లుగా కేటీఆర్‌ ప్రచారం చేయడం ద్వారా 1,200 మంది అమరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్‌తో ప్రారంభం కాలేదని, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తొలిదశ ఉద్య మం వరకు ఎన్నో పోరాటాలు, త్యాగాల పునాదులపై రాష్ట్ర ఏర్పాటు జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం అంటే మీడియా, సోషల్‌ మీడియాను నమ్ముకుని చేసిన పోరాటం కాదని, అది ప్రజల ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమమన్నారు. ఆనాడు కేసీఆర్‌ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మళ్లీ డ్రామా ఆడిన సంగతి అందరికీ తెలుసని వారు పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 04:01 AM