Share News

గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ రమేశ్ సమీక్షా సమావేశం

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:29 PM

గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్‌ పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సృజన, జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌, ఇతర డీసీపీలు పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ రమేశ్ సమీక్షా సమావేశం
Cyberabad CP Ramesh On ganesh Nimajjanam

హైదరాబాద్, సెప్టెంబర్ 22: గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు పక్కా సమన్వయంతో పనిచేయాలని సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్ సూచించారు. భద్రతా ఏర్పాట్లకు సైబరాబాద్‌ వ్యాప్తంగా 465 మంది అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని సీపీ తెలిపారు. ప్రధాన కూడళ్లు, నిమజ్జన మార్గాలు, తటాకాల వద్ద పటిష్ఠ బందోబస్తుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్‌ రద్దీ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీస్, ట్రాఫిక్‌ విభాగాలకు ఆదేశాలు జారీ చేశామని సీపీ చెప్పారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పోలీసులకు సూచించారు. ఈ మేరకు నిమజ్జనాలు పూర్తయ్యేవరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు.


నిమజ్జనాలు దిగ్విజయంగా పూర్తి చేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా తరఫున నుంచి నిమజ్జనానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఏర్పాట్లలో లోపాలను గుర్తించి సరిచేస్తున్నామన్నారు. గణేశ్ నిమజ్జనానికి సంబంధించి ప్రతి చెరువు దగ్గర ఏర్పాట్లు చేశామని.. నిమజ్జనాల్లో ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు.


మునుపటి కంటే మెరుగ్గా..: మున్సిపల్ కమిషనర్ సృజన

వినాయక నిమజ్జనాల కోసం గతంతో పోలిస్తే మెరుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. నిన్నటి వరకు సీఎంసీ పరిధిలో దాదాపు 90 వేల చిన్న, పెద్ద విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఇచ్చే సలహాలతో ఇంకా మెరుగ్గా ఏర్పాట్లు చేస్తామని ఆమె అన్నారు. నిమజ్జనాలపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని కమిషనర్ సృజన అన్నారు.


బేబీ పాండ్ల సంఖ్య పెంచాం: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్

వినాయన నిమజ్జన కార్యక్రమానికి గతంలో పోలిస్తే లైటింగ్ స్పాట్లు మరింతగా పెంచామని మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. నిమజ్జనం సాఫీగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. బేబీ పాండ్ల సంఖ్య పెంచామని ఆయన తెలిపారు. ప్రతి చోట తమ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని మున్సిపల్ కమిషనర్ వినయ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఓయో రూమ్‌లో మహిళ దారుణ హత్య.. ప్రియుడు పరార్..

గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో డ్యాన్స్.. విశాఖ టీమ్‌పై చర్యలు

Updated Date - Sep 22 , 2026 | 09:06 PM