ప్రియురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు గంజాయి రవాణా
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:04 AM
ప్రియురాలికి ఆమె జన్మదినం సందర్భంగా ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్న ఓ యువకుడు ఆమెతో కలిసి గంజాయి రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.
12 కిలోలు తరలిస్తూ పట్టుబడ్డ జంట
ఖమ్మం జిల్లా వైరాలో పట్టుకున్న పోలీసులు, ఈగల్ బృందాలు
హైదరాబాద్/వైరా, సెప్టెంబర్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలికి ఆమె జన్మదినం సందర్భంగా ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్న ఓ యువకుడు ఆమెతో కలిసి గంజాయి రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. వారిని ఖమ్మం జిల్లా వైరా సమీపంలో ఈగల్ బృందాలు, వైరా పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన చైతన్య (21), హేమలత (20) ప్రేమికులు. త్వరలో హేమలత పుట్టినరోజు వస్తుండటంతో ఆమెకు కొత్త ఐఫోన్ బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేసిన చైతన్య.. అందుకోసం డ్రగ్ పెడ్లర్ అవతారమెత్తాడు. గతంలోనూ గంజాయి రవాణా కేసుల్లో మూడుసార్లు అతడు అరెస్టయ్యాడు. ఈసారి కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన శశి, నాగూర్‌లను కలిసి వారికి కావాల్సిన గంజాయిని ఒడిశా నుంచి తెచ్చి ఇస్తానని వారితో ఒప్పందం చేసుకున్నాడు. హేమలతతో కలిసి పల్సర్ బైక్‌పై ఒడిశాకు వెళ్లాడు. అక్కడ పసుపులంక ప్రాంతంలో 5 రోజులు మకాంవేసి స్థానికుడైన భగవాన్ నుంచి 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. గంజాయిని తీసుకుని వీరిద్దరు బైక్‌పై తెలంగాణలోకి వస్తుండగా, వైరావద్ద ఈగల్, వైరా పోలీసు బృందాలు అడ్డుకున్నాయి. పోలీసులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడంతో చైతన్య పోలీసులపైకి బైక్ ఎక్కించేశాడు. ఈ ఘటనలో వైరా ఎస్సై స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చైతన్య, హేమలత కూడా గాయపడ్డారు. వీరి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. మత్తు పదార్థాల కేసుల్లో గతంలో పట్టుబడ్డ వారిని ట్రాకింగ్ చేస్తున్న క్రమంలో చైతన్య కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిపై నిఘా పెంచి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొండా సురేఖ బర్తరఫ్.. స్వయంకృతాపరాధమే!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News