Share News

అవినీతి కేంద్రాలుగా శివారు విద్యుత్‌ సబ్‌డివిజన్లు..!

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:02 AM

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రైవేట్‌ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు కొంతమంది విద్యుత్‌ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి.

అవినీతి కేంద్రాలుగా శివారు విద్యుత్‌ సబ్‌డివిజన్లు..!
Electricity department, corruption

  • విజిలెన్స్‌ విచారణ చేపడుతున్నా చర్యలు నిల్‌

హైదరాబాద్‌ సిటీ: శివారు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వెలుస్తున్న ప్రైవేట్‌ వెంచర్లు, అక్రమ నిర్మాణాలు కొంతమంది విద్యుత్‌ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. మేడ్చల్‌, సంగారెడ్డి, హబ్సిగూడ, సరూర్‌నగర్‌ సర్కిళ్లలోని పలు సబ్‌డివిజన్‌ కార్యాలయాలు అవినీతికి కేంద్రంగా మారాయనే విమర్శలున్నాయి. కీసర డివిజన్‌ పరిధిలో ఓ ఏడీఈ స్థాయి అధికారి అనుమతిలేని ప్రైవేట్‌ వెంచర్‌లో ఎస్టిమేషన్లు లేకుండానే విద్యుత్‌ స్తంభాలు, లైన్‌ వేయించాడనే ఆరోపణలు రావడంతో రాత్రికి రాత్రే ఆ లైన్‌ తొలగించారనే విమర్శలున్నాయి.


సంగారెడ్డి సర్కిల్‌లో ఓ ఏడీఈ ఇన్‌చార్జీ డీఈగా ఉన్నకాలంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, సదరు అధికారులపై విజిలెన్స్‌ విచారణలు చేపడుతున్నా అవి నివేదికలకే పరిమితమవుతున్నాయే తప్ప చర్యల వరకు వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. మేడ్చల్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్లలో కొంతమంది ఏడీఈలు, ఏఈలు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లతో కలిసి పనులు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. మూడేళ్లకు ఒకసారి అధికారుల బదిలీలు చేయాల్సి ఉన్నా కొంతకాలంగా బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఆపరేషన్‌ వింగ్‌లో ఎక్కువకాలంగా పనిచేస్తున్న అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.


city3.jpgఆఫీసులకు రారు...

ప్రతీ రోజు ఆఫీసులకు రావాలి, ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల తీరు మారడం లేదు. సంగారెడ్డి సర్కిల్‌లో ఏడీఈ స్థాయి అధికారి కార్యాలయానికి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియకపోవడంతో ఉన్నతాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. సైబర్‌సిటీ సర్కిల్‌లో కొంతమంది ఏఈలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఓ ఏఈ పనితీరుపై ఈఆర్సీ బహిరంగ విచారణలో పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు లేకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఆరోపణలు వచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రాదని వినియోగదారులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

ఆషాఢ ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 10:02 AM