Share News

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది: వీహెచ్

ABN , Publish Date - May 05 , 2026 | 01:07 PM

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది: వీహెచ్
V Hanumantha Rao

హైదరాబాద్, మే 05: బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన, ఈ నెల 9వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. 'బీసీ హక్కుల కోసం ప్రాణం పోయినా సరే పోరాడుతా' అని స్పష్టం చేసిన వీహెచ్.. బీజేపీ బీసీ ఎంపీలు ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.


'అంబేద్కర్‌ను మా దేవుడిగా భావిస్తాం. అలాంటి మహనీయుడిని కూడా అవమానించే విధంగా పరిస్థితులు ఉన్నాయి' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరుగుతున్న జనగణనలో బీసీల ప్రస్తావనే లేకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బీసీలు ఓట్లు వేయడం లేదా? వారి సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు?' అని వీహెచ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌లకు లేఖలు రాసినా స్పందన రాలేదని వీహెచ్ ఆరోపించారు.


బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ధర్నాలు జరిగినప్పటికీ బీసీ సమస్యలపై కేంద్రం వైఖరిలో మార్పు రాలేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. వీహెచ్ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో బీసీ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి...

ఆకివీడు రామాలయం నిర్మాణంపై పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్‌కు లేదా: బండి సంజయ్

Updated Date - May 05 , 2026 | 01:12 PM