Share News

గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:34 PM

గోదావరి పుష్కరాలు 2027పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy Review

హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2027 జూన్‌లో గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై వారితో చర్చించారు. ప్రధానంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై విపులంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి సంబంధిత అధికారులు వివరించారు.


ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆజ్ఞాపించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలన్నారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని హుకుం జారీ చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తర్వాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.


శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ మాస్టర్ ప్లాన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి.


ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్

Updated Date - Mar 29 , 2026 | 07:54 PM