Share News

ఐపీఎల్2026: చరిత్ర సృష్టించనున్న ముంబై ... తొలి జట్టుగా..

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:20 PM

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కూడా ముంబై తన ఖాతాలో వేసుకోనుంది. ఆ రికార్డు ఏంటంటే...

ఐపీఎల్2026: చరిత్ర సృష్టించనున్న ముంబై ... తొలి జట్టుగా..
Mumbai Indians 300 match record

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా ముంబై జట్టు ఓ అరుదైన మైలురాయిని అందుకోనుంది. ఇవాళ ఆడే మ్యాచ్.. ముంబై జట్టుకు 300వ టీ20 మ్యాచ్‌ కావడం గమనార్హం. తద్వారా 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించనుంది.


ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో 162 విజయాలు,131 ఓటములు నమోదు చేసింది. అలానే నాలుగు మ్యాచ్‌లు టై చేసుకోగా.. రెండు మ్యాచుల్లో ఫలితం తేల్లేదు. ఓవవరాల్‌గా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియ‌న్స్ మూడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌(303) , సోమ‌ర్‌సెట్‌(303) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ 2026 ముగిసేనాటికి, అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా పాకిస్థాన్, సోమర్‌సెట్‌లను ముంబై ఇండియన్స్ అధిగమిస్తుంది. అలానే మరో ఐపీఎల్ రికార్డుపై ముంబై ఇండియన్స్ కన్నేసింది. ఐపీఎల్ జట్లలో గెలుపు శాతం పరంగా చెన్నై(56.67) తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్(54.18) ఉంది. ఈసారి చెన్నైను అధిగమించాలని ముంబై జట్టు పట్టుదలతో ఉంది.


అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ఐపీఎల్ జట్లు

  • ముంబై ఇండియన్స్‌-299

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-287

  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌-281

  • చెన్నై సూపర్ కింగ్స్‌-277

  • ఢిల్లీ క్యాపిటల్స్‌-274


ఇవి కూడా చదవండి:

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

Updated Date - Mar 29 , 2026 | 05:45 PM