మోదీ ఓటమికి సర్‌లోనే పునాది
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:31 AM
‘‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడే కుయుక్తులు పన్నుతారు. ఇదివరకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులను బెదిరించి, అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. ఇప్పుడు మోదీ కొత్త విధానాన్ని కనిపెట్డారు. అదే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగించడం’’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
సర్వే చేయించి ప్రణాళికాబద్ధంగా ఓట్లు తొలగిస్తున్నారు..
అర్హత ఉన్న ఒక్క ఓటూ తొలగించకుండా చూడాలి
మోదీ ఓటమిలోనే కమ్యూనిస్టుల గెలుపు ఉంది
సారంపల్లి పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడే కుయుక్తులు పన్నుతారు. ఇదివరకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులను బెదిరించి, అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. ఇప్పుడు మోదీ కొత్త విధానాన్ని కనిపెట్డారు. అదే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగించడం’’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బిహార్, బెంగాల్‌లో ఇదే కుతంత్రాన్ని ప్రయోగించి గెలిచారని, తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రవీంద్రభారతిలో సీపీఎం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా సీఎం మాట్లాడుతూ ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలోనే గ్రామాల్లో ఉండడం లేదన్న కారణం చూపి పట్టణాలకు వలస వెళ్లిన 81 వేలమంది ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందని ఆక్షేపించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల వ్యవస్థ వరకూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రణాళికాబద్ధంగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. సర్ ప్రక్రియ తెలంగాణలో మొదలుగాక ముందు మాట్లాడిన ప్రతిపక్షం, ఇప్పుడు ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. దీని వెనక కుట్రలను, రహస్య ఒప్పందాలను ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ఒక్క ఓటును కూడా తొలగించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తద్వారా మోదీ ఓటమికి ఇవాళే పునాది పడాలని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు తొలగినా మోదీకి వెయ్యేనుగుల బలం చేకూరుతుందని, మోదీ ఓటమిలోనే కమ్యూనిస్టుల గెలుపు ఉందని చెప్పారు. రైతు, వ్యవసాయ కూలీల హక్కుల పోరాటానికి జీవితాన్ని అంకితం చేసిన సారంపల్లి మల్లారెడ్డిని కోల్పోవడం రైతాంగ ఉద్యమానికి తీరని లోటని సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. అన్నదాతల శ్రేయస్సు కోసం జీవితాన్ని ధార పోయడం గొప్ప విషయమన్నారు. ‘‘ప్రజా సమస్యల మీద కొట్లాడినవాళ్లు పదవులు ఆశిస్తారు. లేదంటే గుర్తింపు కోరుకుంటారు. వాటన్నింటికీ అతీతంగా.. రైతు, వ్యవసాయ కూలీల అభ్యున్నతే పరమావధిగా తుదివరకు పనిచేసిన మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా క్యాబినెట్‌లో చర్చించి మంచి కార్యక్రమం ప్రకటిస్తాను’’అని హామీ ఇచ్చారు. కాగా, లౌకిక, ప్రజాస్వామిక విలువలను మోదీ ప్రభుత్వం పూర్తిగా కాలరాస్తోందని సీపీఎం జాతీయ నాయకుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. రాజ్యాంగంపై దాడులకు తెగబడుతోందని, అందులో ఎస్‌ఐఆర్ ప్రధానమైనదని విమర్శించారు. నియంతృత్వాన్ని వ్య తిరేకించి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడమే సారంపల్లికి మనమిచ్చే అసలైన నివాళి అన్నారు.
మన జీవితం ఇంతేనా కామ్రేడ్స్: ఎమ్మెల్యే కూనంనేని
మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అంటూ రేవంత్ రెడ్డి తెలివిగా మాట్లాడారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మన జీవితం ఇంతేనా కామ్రేడ్స్? ఇంకెంతకాలం ఇలా? పట్టింపులు, పంతాలకు పోయి ఏం చేస్తున్నాం’’ అంటూ కమ్యూనిస్టు పార్టీల అనైక్యతపై ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని మనమే ఎదగనివ్వకుండా చేసుకుంటున్నామని, ఎర్ర జెండాలన్నీ ఒక్కటవ్వాలని ఆకాంక్షించారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీల ఐక్యతకు సీపీఎం కట్టుబడి ఉందని, సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి ప్రజా సమస్యలపై పోరాడదామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేస్తారా?
బీఆర్‌ఎస్ వర్సెస్ పోలీస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News