నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దు అంశం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలివే
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:24 PM
నైని కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ రద్దు చేయడానికి గల కారణాలపై విచారించేందుకు ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కమిటీని వేసింది. ఈ ఇద్దరు అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది.
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం(Central Govt) నిర్ణయించింది. నైని కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలు సహా ఇతర అంశాలపైనా సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం దర్యాప్తు చేయనుంది.
ఈ బృందంలో బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందానికి మూడు రోజుల సమయం ఇచ్చింది కేంద్రం. మూడు రోజుల్లో సింగరేణిలో పర్యటించి.. నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరిపి.. ఆ నివేదికను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది.

ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తీవ్రమైన ఆరోపణలు రావడంతో దీనిపై స్పందించిన తెలంగాణ డిప్యూటీ సీఎం, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క టెండర్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే నైని బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) కూడా ప్రకటించింది. అయితే.. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు(గురువారం) సాయంత్రం 5:00 గంటల నుంచి బిడ్లు ప్రారంభం కావాల్సి ఉంది. పాలనాపరమైన కారణాలతో టెండర్లను రద్దు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా భారత్.. ఇదే ప్రధాని విజన్: గవర్నర్ జిష్ణుదేవ్
కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్
Read Latest Telangana News And Telugu News